Agriculture Reforms : పైరుకు చీడవస్తే...ఇక పంట డాక్టర్‌ని సంప్రదించాలి !

0

అవును..ఇది నిజం అండీ బాబు. మనకు అనారోగ్యం వస్తే వైద్యుడిని ఎలా సంప్రదించి రోగానికి తగ్గ మందు ఎలా తీసుకుంటామో..అచ్చంగా అలాగే పైరుకు చీడపీడలు వస్తే వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించాలి. వైద్యుడి తరహాలో వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు సూచించిన ఎరువులు, పురుగు మందులను మాత్రమే వాడాలన్న మాట. ఎంత మోతాదులో వాడాలో కూడా వారే స్పష్టం చేస్తారు. తదనుగుణంగా డీలర్లు విక్రయించనున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. నాలుగెళ్ల క్రితం ఈ విధానంపై ఆదేశాలివ్వగా నామమాత్రంగా సాగింది. కానీ వచ్చే పంటల నుంచి పక్కాగా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించాయి. విచ్చలవిడిగా పురుగు మందులు, ఎరువులు పిచికారి చేయడంతో జీవ వైవిధ్యం దెబ్బతింటుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల క్రమంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. ఏ పంటకు ఏ మందులు వాడాలో అవే వాడాలి. మోతాదుకు మించి పురుగు మందులు పిచికారి చేస్తే వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉండటంతో ఇక నుండి కట్టుదిట్టంగా పురుగు మందులు, ఎరువుల విక్రయాలు జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారి, సహాయ సంచాలకులు చీటీ రాసిస్తేనే డీలర్లు విక్రయాలు చేయనున్నారు.

ధ్రువీకరణ లేకుండా చేస్తే కఠిన చర్యలు

రైతులు విచ్చలవిడిగా ఎరువుల వాడకాన్ని, పురుగు మందుల పిచకారి అరికట్టవచ్చన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. వ్యవసాయ విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ చట్టం 1983, ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ వ్యవసాయ అధికారి ధ్రువీకరణ లేకుండా విక్రయాలు చేస్తే చట్టప్రకారం చర్యలు చేపట్టనున్నారు. పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి, జొన్న, అపరాలు, కూరగాయలు తదితర పంటలకు ఏ తెగుళ్లు సోకినా వ్యవసాయ అధికారులే ఏ మందులు పిచికారి చేయాలో నిర్దేశించనున్నారు. రైతులు మానవ వైద్యులను ఆశ్రయించినట్లుగా పంటలకు రోగాలొస్తే వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్న మాట..

నిబంధనలు కఠినతరం..

ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయించే డీలర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే.. జీవ ఎరువులు, జీవ పురుగు మందులకు సంబంధించి ప్రభుత్వ అనుమతి గల వాటినే విక్రయించాలి. అలాగే కొనుగోలు చేసిన రైతుకు ప్రతి వస్తువుకు బిల్లు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే దుకాణంలో నిల్వ వివరాలు, ధరల బోర్డు, లైసెన్సు, స్టాక్‌ రిజిస్టర్స్‌, నిల్వ చేసే స్థల వివరాలన్ని ప్రదర్శించాలి. ఇందులో ఏది పాటించకున్నా అనుమతి రద్దు చేయనున్నారు. రోజువారీగా వివరాలను నమోదు చేయడంతో పాటు ప్రతి అంశాన్ని పేర్కొనాలని నిర్దేశించింది.

ఇకపై అన్నింటా తనిఖీలు..

వ్యవసాయ రంగంలో రైతుల ప్రయోజనం, ప్రభుత్వ ఆదాయం దృష్ట్యా కఠినంగా వ్యవహరించనున్నారు. గతంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాల్లో అరకొరగా తనిఖీలుండేవి. వ్యవసాయ అధికారులతో ఉన్న సాన్నిహిత్యంతో జీరో దందా చేసిన డీలర్లకు కూడా కొదవలేదు. ఈ క్రమంలో అన్ని దుకాణాల్లో తనిఖీలు చేసి ప్రతి సీజన్లో నివేదికలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !