Cheetah Trapped In Cage at Tirumala : తిరుమలలో చిక్కిన చిరుత...మరో 5 చిరుతల సంచారం !

0

తిరుమలలో అలిపిరి నడక మార్గంలో వెళ్తున్న బాలికపై దాడిచేసి హతమార్చిన చిరుత పులి ఎట్టకేలకు బోనులో చిక్కుకుంది. బాలిక మృతితో అప్రమత్తమైన తిరుమల అధికారులు, అటవీశాఖ సిబ్బంది చిరుత పులికోసం గాలింపు చేపట్టారు. అయితే, బాలిక మృతదేహం లభ్యమైన ఘటనస్థలి, చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సోమవారం తెల్లవారు జామున అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత పులి చిక్కుకుంది. బాలికపై దాడిచేసిన ప్రాంతానికి అతిదగ్గరలోనే చిరుత బోనులో చిక్కింది. 

బాలిక మృతితో  విషాదం

తిరుమలలో గత మూడు రోజుల క్రితం విషాదం నెలకొంది. తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనంకోసం నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేశ్‌ కుమార్‌, శశికళ దంపతులు ఆరేళ్ల కుమార్తె లక్షితతో కలిసి తిరుమల బయలుదేరారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన బయలుదేరారు. రాత్రి 7గంటల సమయంలో నరసింహస్వామి ఆలయ సమీపంలో బాలిక కనిపించకుండా పోయింది. రాత్రి 10.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాత్రి నుంచే నడక మార్గం, అడవి ప్రాంతంలో టీటీడీ, అటవీశాఖ, పోలీస్‌ శాఖ సిబ్బంది వెతుకులాట ప్రారంభించారు. శనివారం ఉదయం నడకదారికి 150 మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో చిన్న బండరాయిపై బాలిక మృతదేహాన్ని గుర్తించారు. చిరుత దాడిచేసి ముఖభాగాన్ని తినడంతో పాటు కాలును తీవ్రంగా గాయపర్చినట్లు గుర్తించారు. ఆ తరువాత లక్షిత మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు బాలిక మృతదేహాన్ని అప్పగించారు.బాలిక మృతి ఘటనతో చిరుత పులికోసం అటవీశాఖ అధికారులు వెతుకులాట ప్రారంభించారు. ఈక్రమంలో బాలిక మృతిచెందిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు బోన్లు, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుతపులి చిక్కుకుంది. చిరుత చిక్కుకున్న బోనుతో సహా ట్రాలీ ఆటోలో ఎక్కించి అటవీ శాఖ అధికారులు వేరే ప్రాంతానికి తరలించారు.

అలిపిరి కాలినడక పరిసరాల్లో మరో 5 చిరుతల సంచారం

తిరుమల అలిపిరి కాలినడక పరిసరాల్లో మరో ఐదు చిరుతలు సంచరిస్తున్నాయి. తిరుమల ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయం పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నాయని.. ఈమేరకు ట్రాప్‌ కెమెరాల్లో చిరుతల దృశ్యాలు నమోదయ్యాయని అటవీశాఖ అధికారులు వెల్లడిరచారు. ఈ నేపథ్యంలో చిరుతల నుంచి భక్తులకు భద్రతపై తితిదే, అటవీశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో మధ్యాహ్నం 3గంటలకు ఈ సమీక్ష జరగనుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !