ఈ బంధం చాలా చిత్రమైనది. స్నేహితులుగా కలిసిన వారు జీవితాంతం ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా కలిసిపోయారు. మనసులు కూడా కలిశాయి. మనువాడాలనుకున్నారు. కానీ ఇద్దరూ మగవారు కావడంతో ఒకరు లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ట్రాన్స్ జండర్‌గా మారిన వ్యక్తి తన వద్ద ఉన్న డబ్బు, బంగారం మొత్తం కాబోయే భర్త చేతిలో పెట్టింది. అతడేమో వాటిని తీసుకుని ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. మోసపోయానని గ్రహించిన ట్రాన్స్ జండర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విచిత్ర ఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఆలోకం పవన్ కుమార్, విజయవాడలోని కృష్ణలంకకు చెందిన ఈలి నాగేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు సుమారు ఆరేళ్ల కిందట కానూరు వీఆర్ సిద్ధార్థ కాలేజీలో బీఈడీ కలిసి చదువుకున్నారు. చదువుకునే రోజుల్లో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడగా.. అది కాస్తా ప్రేమగా మారింది. ఆ కాలేజీలో బీఈడీ పూర్తి చేసిన తర్వాత 2019లో ఇద్దరూ కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఇంటి ఓనర్‌కు తామిద్దరూ స్నేహితులుగా పరిచయం చేసుకుని సహజీవనం చేశారు. అదే ఇంట్లో ట్యూషన్ చెప్పుకుంటూ జీవనం సాగించారు. వారి వద్దకు ట్యూషన్‌కు వచ్చే విద్యార్థులకు, వపన్, నాగేశ్వరరావుల తల్లిదండ్రులకు కూడా వీరిద్దరూ మగవారిగానే తెలుసు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో పవన్‌ను నాగేశ్వరరావు ఢల్లీి తీసుకెళ్లి సుమారు రూ.11 లక్షలు ఖర్చుచేసి అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించాడు. అనంతరం అతని పేరును భ్రమరాంబికగా మార్చాడు.
పెళ్ళికి నిరాకరించిన నాగేశ్వరరావు !
ట్రాన్స్‌జెండర్‌గా మారిన తరువాత తనను వివాహం చేసుకుంటాడన్న నమ్మకంతో భ్రమరాంబిక 11 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.26 లక్షల నగదు నాగేశ్వరరావుకు ఇచ్చింది. ఐతే నాగేశ్వరరావు మాత్రం ప్లేట్ ఫిరాయించి ఆమెను మోసం చేశాడు. భ్రమరాంబికతో పెళ్లికి నిరాకరించిన నాగేశ్వరరావు గతేడాది డిసెంబర్‌లో ఆమెను ఇంటి నుంచి గెంటేసి, తన తల్లి విజయలక్ష్మితో కలిసి మంగళగిరి వెళ్లిపోయాడు. మోసపోయిన భ్రమరాంబిక గత్యంతరం లేని స్థితిలో పెనమలూరులోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మంగళగిరిలో నాగేశ్వరరావు ఉన్నాడన్న సమాచారం అందుకున్న భ్రమరాంబిక మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి వ్యవహారం మొత్తం కృష్ణలంక కేంద్రంగా సాగడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంగళగిరి పోలీసులు తెలిపారు. కృష్ణలంక పోలీసులు బాధితురాలి ఫిర్యాదు నమోదు చేసుకుని నాగేశ్వరరావు, అతని తల్లి విజయలక్ష్మిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నమ్మించి మోసంం చేసాడని నాగేశ్వరావుతో పాటు అతని తల్లిపై కేస్ నమోదు చెసింది. ట్రాన్సజేండర్ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన చేసిన పోలీసులు.. సెక్షన్ 406,420,34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మరోవైపు భ్రమరాంభకు న్యాయం చెయ్యాలని ట్రాన్సజెండర్ సంఘం డిమాండ్ చేస్తుంది.