రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో మరోసారి విజయఢంకా మోగించి హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్‌ఎస్ ఈసారి అభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలు చేయలేదు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో పాత అభ్యర్థులకే మెజార్టీ సీట్లు కట్టబెట్టింది. ఒకేసారి 115 మందితో జాబితా విడుదల చేసిన కేసీఆర్.. ఏడుగురు సిట్టింగ్‌లను మాత్రమే మార్చారు. ఇక పొలిటికల్ వారసుల సంగతిని పట్టించుకోలేదు. ఈసారి తమ వారసులను బరిలో దింపి అసెంబ్లీలో తమతో పాటు కూర్చోబెట్టుకుందామనుకున్న సిట్టింగ్‌లకు నిరాశే మిగిలింది. పరిస్థితిని గమనించి ఈ విషయంలో కొందరు సర్దుకుపోతే.. ఒకరిద్దరు నేతలు మాత్రం గుర్రుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఆశించారు. లిస్ట్‌లో అక్కడ పద్మా దేవేందర్ రెడ్డి పేరు ఉండటంతో మైనంపల్లి గరం గరంగా ఉన్నారు. అదే సమయంలో పార్టీ ముఖ్య నేత హరీష్‌రావు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఆయన పార్టీలో ఉంటారా? లేక వేరేదారి చూసుకుంటారా అన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది.
ఒక్క సీటుతో బీఆర్‌ఎస్‌లో సరిపెట్టుకుంటారా ? లేక
గతంలో టీడీపీలో ఉన్న మైనంపల్లి బీఆర్‌ఎస్‌లో చేరాక మొదట్లో ఎమ్మెల్సీ ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు కేసీఅర్. అయితే.. ముందు నుంచి ఆయన తీరు ఇబ్బందికరంగానే ఉందంటున్నాయి గులాబీ వర్గాలు. పార్టీ పరంగా ఎటువంటి సంకేతాలు లేకుండానే ఎమ్మెల్యే తన కుమారుడిని మెదక్ బరిలో దింపాలనుకున్నారు. తీరా తాను అనుకున్నది జరక్కపోవడంతో మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేయడం ఏంటని తప్పు పడుతున్నారు కొందరు నేతలు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మైనంపల్లి హన్మంతరావు ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠతోపాటు ఆయన విషయంలో పార్టీ అధినాయకత్వంపు వైఖరి ఎలా ఉంటుందన్న చర్చ సైతం జోరుగా జరుగుతోంది. లిస్ట్‌లో ఆయనకు మల్కాజ్‌గిరి టిక్కెట్ ప్రకటించేశారు కేసీఆర్. ఇక ఎంత గింజుకున్నా అంతకు మించి మార్పు ఉండే ఛాన్స్ లేకపోవడంతో ఉత్కంఠ పెరుగుతోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న అంతర్గత సమాచారం ప్రకారం హన్మంతరావుపై చర్యలకే గులాబీ పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. అయితే.. తొందర పడకుండా.. సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని అంటున్నారు. మరి ఎమ్మెల్యే అప్పటిదాకా వేచి చూస్తారా? లేక ఈలోపే తన నిర్ణయం తాను తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.