Namburu Sankar Rao Comments on Lokesh Yuvagalam: లోకేష్‌ పాదయాత్ర ప్రజల కోసం కాదు, ఆయన స్వలాభం కోసమే

0

  • టీడీపీ పాలనలో జరిగింది అభివృద్ధి కాదు.. దోపిడీ
  • వైసీపీ ప్రభుత్వం పేదవాడి కష్టాలు తీరుస్తోంది. 
  • పెదకూరపాడు అభివృద్ధిపై నారా లోకేష్‌కు సవాల్‌

పెదకూరపాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు స్థానికఎమ్మెల్యే నంబూరు శంకరరావు సవాల్‌ విసిరారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను మీడియా ప్రతినిధులతో కలిసి సందర్శించారు.  75 తాళ్లూరులో ప్రాథమిక పాఠశాల, పెదకూరపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, క్రోసూరు మండలం ఊటుకూరు జగనన్న కాలనీ, క్రోసూరు పాలిటెక్నిక్‌ కాలేజ్‌ తో పాటు అమరావతి - బెల్లకొండ డబుల్‌ రోడ్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు మాట్లాడుతూ.. గత నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనుల వద్ద సెల్ఫీలు తీసుకున్నానన్నారు.  గతంలో పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కొమ్మాలపాటి శ్రీధర్‌ గాని.. ఐదేళ్లు మంత్రిగా ఉన్న నారా లోకేష్‌ గానీ.. వాళ్లు చేసిన అభివృద్ధి పనులను ఇలా చూపించగలరా అని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో అభివృద్ధి ఏం జరిగిందో తెలియదు కానీ.. దోపిడీ మాత్రం భారీగా జరిగిందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు విమర్శించారు. ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయడంలో విఫలమైనప్పుడు నాయకులు పాదయాత్రలు చేసేవారన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు రైతుల కోసం పాదయాత్ర చేశారన్నారు. అలాగే టీడీపీ పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే.. జగన్‌గారు జనంలోకి వెళ్లి పాదయాత్రలో వాళ్ల కష్టాలు తెలుసుకున్నారన్నారు. అధికారంలోకి రాగానే వారి కష్టాలు తీర్చేందుకు కష్టపడుతున్నారన్నారు. కానీ లోకేష్‌కు తాను పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో తెలియదని ఎద్దేవా చేశారు. జగనన్న చేస్తున్న మంచిని చూసి ఓర్వలేక.. చంద్రబాబు సభలు పెట్టి జనాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి ఎన్ని పాదయాత్రలు చేసినా ఫలితం ఉండదన్నారు. జగనన్న పాలనలో గత నాలుగేళ్లలో పెదకూరపాడు నియోజకవర్గం ఊహించని విధంగా అభివృద్ధి చెందిందన్నారు. నియోజకవర్గంలో సుమరు రూ.1300 కోట్ల మేర సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించామన్నారు. రూ.655 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని.. కానీ జగనన్న సచివాలయాల ద్వారా లక్షన్నరకు పైగా ఉద్యోగాలిచ్చారన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క పేదవాడికి అయనా ఇల్లు కట్టించారా అని ప్రశ్నించారు. కానీ సీఎం జగన్‌ గారు.. ప్రతి గ్రామంలో జగనన్న కాలనీల్లో పేదలకు సొంతింటి కల తీరుస్తున్నారన్నారు.

అభివృద్ధి కార్యక్రమం దగ్గర ఒక్క సెల్ఫీఅయినా తీసుకోగలరా ?

పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి.. తమ పాలనలో జరిగిన అభివృద్ధిపై టీడీపీ నేతలకు చర్చకు వచ్చే ధైర్యముందా అని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రశ్నించారు. తాను నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి ఫలితమే ఈ స్కూళ్లు అనిచెప్పారు. నియోజకవర్గంలో రూ.84.67 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు గదులు ఏర్పాటు చేశామన్నారు. నాడు నేడు ద్వారా రూ.28.18 కోట్లతో పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించామన్నారు. రూ.31.05 కోట్లతో 54 పాఠశాలల్లో అదనపు గదులు నిర్మించామన్నారు.  రూ.8.35 కోట్లతో 52  పాఠశాలలకు ప్రహరీగోడలు నిర్మించామన్నారు. రూ.4.64 కోట్లతో 29 డిజిటల్‌ లైబ్రరీలు నిర్మించామన్నారు.  రూ.4.20 కోట్లతో కేజీబీవీ,రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌ లు నిర్మించామన్నారు. టీడీపీ హయాంలో కనీసం ఒక్క స్కూల్‌ అయినా బాగు చేశారా అని ప్రశ్నించారు. 

ప్రజారోగ్యమే లక్ష్యంగా ఆసుపత్రుల అభివృద్ది !

పెదకూరపాడులో రూ.8.69 కోట్లతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మీడియా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారు సందర్శించారు. తెలుగుదేశం హయాంలో వైద్యాన్ని, ప్రజల ప్రాణాలను పట్టించుకోకపోతే.. ప్రజారోగ్యమే ప్రథమ లక్ష్యంగా  జగనన్న పాలన సాగుతోందన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో రూ.34.79 కోట్లతో ఆస్పత్రులు బాగు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే సొంత ఊరు పెదకూరపాడు ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారన్నారు. కానీ తాము నూతన భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు.రూ13.10 కోట్లతో 8 ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, రూ.11.89 కోట్లతో రెండు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు,  రూ.9.80 కోట్లతో 56 హెల్త్‌ వెల్‌ నెస్‌ సెంటర్లు నిర్మిస్తున్నామన్నారు. దీనిపై లోకేష్‌ ఏం చెబుతారో వినాలని ఆసక్తిగా ఉందన్నారు. 

సొంతింటి కలలు తీర్చేందుకే జగనన్న కాలనీలు

పేదలకు కనీసం ఒక్క సొంతిల్లు కూడా ఇవ్వలేదని టీడీపీపై ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారు మండిపడ్డారు. క్రోసూరు మండలం ఉటుకూరులోని జగనన్న పాలనలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని సందర్శించారు. ఇలాంటి అభివృద్ధి టీడీపీ హయాంలో జరిగిందా అని ప్రశ్నించారు. సెల్ఫీ కింగ్‌ లు అయిన టీడీపీ నేతలు ఇలాంటి సెల్ఫీ ఒక్కటి అయినా తీసుకోగలరా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే దత్తత తీసుకున్న గ్రామానికి రోడ్డు కూడా వేయలేకపోతే.. తాను కన్నెగండ్లకు రోడ్డు వేశానని గుర్తు చేశారు. 

క్రోసూరు పాలిటెక్నిక్‌ కాలేజ్‌ పూర్తి చేసింది మేమే

రూ.7.25 కోట్లతో కేవలం ఏడాదిన్నరలో నిర్మించి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న క్రోసూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ను ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారు సందర్శించారు.  2009లోనే పాలిటెక్నిక్‌ కాలేజీ వచ్చినా.. సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా.. మాజీ ఎమ్మెల్యే  కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. కానీ తాను కేవలం ఏడాదిన్నరలో నిర్మణం పూర్తి చేసి.. క్లాసులు కూడా జరిగేలా చేస్తున్నానన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కొమ్మలపాటి శ్రీధర్‌ కానీ..ఐదేళ్లు మంత్రిగా చేసిన నారా లోకేష్‌ కానీ.. దీనికి సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇలాంటి ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా అని ప్రశ్నించారు.

దశాబ్దాల కల తీరుస్తుంది మేమే

తనపై విమర్శలు చేసేందుకు పాదయాత్రగా వస్తున్న లోకేష్‌ నడుస్తున్నది తాము వేసిన రోడ్ల మీదేనని పెదకూరపాడు ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారు అన్నారు. అమరావతి - బెల్లంకొండ డబుల్‌ లేన్‌ రోడ్డు పనులను సందర్శించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ పాలనలో తట్ట మట్టి వేసిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. గత నాలుగేళ్లలో జగనన్న ఆశీర్వాదంతో పెదకూరపాడు చక్కని అభివృద్ధి సాధించిందన్నారు. నాలుగేళ్లలో రూ.346.29 కోట్లతో నియోజకవర్గంలో 90 శాతానికి పైగా రోడ్లు తాము నిర్మించినవేనన్నారు. రూ.149 కోట్లతో అమరావతి - బెల్లంకొండ డబుల్‌ లేన్‌ రోడ్డు,  రూ.60 కోట్లతో కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మిస్తున్నామన్నారు.  రూ.44.18 కోట్లతో అమరావతి - తుళ్లూరు రోడ్డు, పెదమద్దూరు హైలెవల్‌ బ్రిడ్జి నిర్మిస్తున్నామన్నారు. రూ.27.09 కోట్లతో అర్‌ అండ్‌ బి తారు రోడ్లు, రూ.23.73 కోట్లతో పంచాయతీరాజ్‌ తారురోడ్లు,  రూ.33.50 కోట్లతో గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు,  రూ.8.34 కోట్లతో సీసీ డ్రెయిన్ల నిర్మాణం చేశామన్నారు. తాము చాసిన దాంట్లో కనీసం పది శాతమైనా టీడీపీ చేసిందా అని ప్రశ్నించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !