భారత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో కీలక మార్పులు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందు కోసం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసింది. కానీ, దీనికి ఆమోద ముద్రవేయించడం అంత తేలికైన పనేమీ కాదు. దీనికోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలకు ఏర్పాటు చేసింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ నిర్వహణ కోసం సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వాస్తవానికి గతంలో ఈ రకంగా ఎన్నికలు జరిగినా వివిధ కారణాలతో మార్పులు చోటు చేసుకొన్నాయి.
ఏమిటీ జమిలీ ఎన్నికలు..?
దేశ వ్యాప్తంగా ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నది దీని లక్ష్యం. అంటే లోక్‌సభ-శాసనసభ ఎన్నికల ఓటింగ్ ఒకేసారి నిర్వహించడం. ప్రస్తుతం శాసనసభలకు, పార్లమెంట్‌కు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి సెప్టెంబర్ 18-22 మధ్య జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ప్రధానిగా మోదీ తొలిసారి అధికారం చేపట్టిన నాటి నుంచే దీనిపై మాట్లాడుతున్నారు.
అంత తేలిక కాదు..
ఈ బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సవరణలకు లోక్‌సభలోని 543 స్థానాల్లో కనీసం 67శాతం అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం దీనిని సమర్థించాలి. దీనికి తోడు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోద ముద్రవేయాలి. అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లు పక్షాన నిలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భాజపా 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. దానికి మద్దతు ఇచ్చే పక్షాలు మరో 6 రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి. ఎన్‌డీఏకు లోక్‌భలో దాదాపు 333 ఓట్ల బలం ఉంది. ఇది 61శాతానికి సమానం. మరో 5శాతం ఓటింగ్‌ను సంపాదించడం దానికి కష్టమే. రాజ్యసభలో కేవలం 38శాతం మాత్రమే సీట్లు ఉన్నాయి.
కలిపి ఎన్నికలు ఎందుకు..?
2019లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రూ. 10,000 కోట్లు వెచ్చించినట్లు అంచనాలున్నాయి. అదే సమయంలో ఒక్కో రాష్ట్ర ఎన్నికలకు ప్రభుత్వం రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఖర్చుకు రాజకీయ పార్టీల వ్యయం చేర్చితే కళ్లు తిరిగిపోతాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ఆయా పార్టీల ఖర్చు రూ.60 వేల కోట్ల వరకు ఉందని అప్పట్లో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ వెల్లడిరచింది. భారత చరిత్రలోనే అవి అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి. ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు ఈ ఖర్చు మొత్తం కలిసొస్తుందన్న వాదన ఉంది. దీంతోపాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సమర్థంగా వినియోగించుకొనే అవకాశం లభిస్తుంది. సాధారణ అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటే పాలన మందగిస్తుంది. అందుకే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే.. సమయం ఆదా అయి వారు పాలనపై దృష్టి సారించడానికి అవకాశం లభిస్తుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలు, పథకాలను అమలు చేయడంలో తరచూ ఎన్నికల కోడ్ రూపంలో అడ్డంకులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. దీంతోపాటు ఎన్నికల కోడ్ కారణంగా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం వంటివి వాయిదా పడే అవకాశాలుండవు. జమిలీ ఎన్నికల కారణంగా ఒకేసారి అన్ని రకాల ఓటింగ్‌లు జరగడం ఓటర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఫలితంగా పోలింగ్ శాతం పెరుగుతుందని లా కమిషన్ పేర్కొంది.
ఇబ్బందులూ ఉన్నాయి..
శాసనసభ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో పాటు జరపడానికి వీలుగా రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం సహా ఇతర పార్లమెంటరీ ప్రొసీజర్లను సవరించాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్రాల అంగీకారం కూడా చాలా అవసరం. జమిలీ ఎన్నికల కారణంగా జాతీయ అంశాలు ప్రచారంలో అధిక భాగాన్ని ఆక్రమిస్తే.. స్థానిక అంశాల పాత్ర తగ్గిపోతుందని పార్టీలు భయపడుతున్నాయి. ముఖ్యంగా స్థానిక పార్టీల్లో ఈ భయం ఎక్కువగా ఉంది. ఇక ఎన్నికల ఖర్చులో కూడా స్థానిక పార్టీలు జాతీయ పార్టీలతో పోటీపడాల్సి రావడం ఇబ్బందికరంగా మారుతుందనే అనుమానాలున్నాయి. 2015లో జరిగిన ఓ సర్వే ప్రకారం, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమిని ఎన్నుకునే అవకాశాలున్నాయి. అదే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఆరు నెలలు తేడాతో నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకొనే అవకాశాలు 61శాతానికి తగ్గిపోతాయని తేలింది.
గతంలో జరిగినా..
1967 వరకు ఈ విధంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోసం ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. కానీ, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దుకావడం, 1970లో ఏడాది ముందే లోక్‌సభ రద్దు వంటి పరిణామాలతో ఈ విధానం కొనసాగించడం సాధ్యం కాలేదు. 1983లో ఎన్నికల కమిషన్ మరోసారి జమిలీ ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. కానీ, అప్పట్లో ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. 1999లో లా కమిషన్ నివేదిక దీనిని మరోసారి లేవనెత్తింది. 2016లో ప్రధాని మోదీ ఈ ఆలోచనను మరోసారి ప్రతిపాదించారు. ఆ మరుసటి ఏడాదే దీనిపై నీతి ఆయోగ్ కసరత్తు చేసింది. 2019లో ఈ అంశంపై ప్రధాని వివిధ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్ సహా చాలా పక్షాలు దీనికి దూరంగా ఉన్నాయి. అతికొద్ది పార్టీలు మాత్రమే ప్రతినిధులను పంపాయి. 2022లో తాము జమిలీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమని సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. 2022 డిసెంబర్‌లో ఈ రకం ఎన్నికలపై లాకమిషన్ వివిధ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలను ఆహ్వానించింది.