రాత్రంతా హైడ్రామా
అంతకుముందు చంద్రబాబు బస చేసిన ఆర్.కె.ఫంక్షన్ హాల్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక చంద్రబాబు బస చేస్తున్న ప్రదేశానికి అధికసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అనంతపురం నుంచి పోలీసు బృందాలను నంద్యాలకు రప్పించారు. మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తెదేపా శ్రేణులు ఆర్.కె ఫంక్షన్ హాల్ వద్దకు భారీగా తరలివచ్చాయి. శనివారం ఉదయం 5 గంటల తర్వాత చంద్రబాబు బస చేస్తున్న వాహనం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. వాహనం చుట్టూ ఉన్న తెదేపా నేతలను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కాలవ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్‌రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి తదితర స్థానిక తెదేపా నేతలు ఉన్నారు. బస చేసిన బస్సు నుంచి చంద్రబాబు కిందికి రావడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబు ఆరోగ్యం అంతగా బాగోలేదు
చంద్రబాబు అరెస్టుపై ఆయన తరఫు న్యాయవాది స్పందించారు. ‘‘చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. వైద్యపరీక్షల్లో చంద్రబాబుకు హైబీపీ, షుగర్ ఉంది. చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్‌కు ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. కేసుతో సంబంధం లేని సెక్షన్లు నమోదు చేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో 37వ ముద్దాయిగా పేర్కొన్నారు’’ అని తెలిపారు.