ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం 10 రోజులు రాష్ట్రంలో లేని సమయం... అది కూడా కోర్టుకు సెలవు రోజైన శనివారం తెల్లవారుజామున ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు ప్రకటించటం వెనుక చాలా పెద్దఎత్తున ఆంధ్రప్రదేశ్ సిఐడి కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకుల్ని, శ్రేణుల్ని గృహనిర్భందంలోకి తీసుకోవటం ఎక్కడా నిరసన కార్యక్రమాలు లేకుండా పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకోవటం చూస్తే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు అర్థం అవుతోంది. మరో వైపు దిల్లీ వేదికగా జీ`20 శిఖరాగ్ర సదస్సు జరుగుతుండగా ప్రపంచ మీడియా మొత్తం భారత్ వైపే చూస్తోంది. ఇదే సందర్భంలో చంద్రబాబును అవినీతిపరుడుగా ముద్రవేసి అరెస్ట్ చేయటం దేశమీడియా ప్రముఖంగా కవర్ చేయటం, ప్రపంచదేశాల ప్రతినిధులకు ఎంతో కొంత ప్రభావితం చేస్తుందనే కారణంతోనే ఈ సమయాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఇమేజ్‌ను డ్యామేజ్ చేయటమే లక్ష్యంగా ఈ అరెస్ట్ జరిగినట్లు భావించవచ్చు.