ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు అత్యవసర పిటిషన్‌పై ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరగా.. హైకోర్టు అంగీకరించింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని, చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను న్యాయమూర్తి ప్రశ్నించారు. గతంలో తాను పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలన్న జడ్జి.. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తామని పేర్కొన్నారు. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం వరకు కస్టడీపై నిర్ణయం తీసుకోవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అంటే అప్పటి వరకు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి హైకోర్టు వాయిదా వేసింది.