CM Jagan : కొందరికీ టికెట్లు ఇవ్వలేకపోవచ్చు !

0

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మర్నాటి నుంచే వచ్చే ఎన్నికల కోసం పార్టీ గేర్‌ మార్చాలి అని వైకాపా ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం జగన్‌ దిశానిర్థేశం చేశారు. ‘‘ఈ నాలుగున్నరేళ్లు చేసింది ఒక ఎత్తు.. వచ్చే ఆర్నెల్లు మరో ఎత్తు. రాబోయే రెండు నెలలు జనంలోనే ఉండాలి. ఇందుకోసం అధికారికంగా ‘జగనన్న ఆరోగ్యసురక్ష’, పార్టీపరంగా ‘ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి’ అనే కార్యక్రమాలను ఇస్తున్నాం’’ అని చెప్పారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల బాధ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

సర్వేలు చివరికొచ్చాయి

‘‘నియోజకవర్గాల్లో సర్వేలు చివరికొచ్చాయి. వచ్చే రెండు నెలలు మీకు కీలకం. మీలో చాలామందికి మళ్లీ టికెట్లు రావొచ్చు.. కొందరికి టికెట్లు ఇవ్వలేకపోవచ్చు. ప్రజల్లో మీరుంటున్న తీరు, మీకున్న ఆదరణ వంటివాటిని బేరీజు వేసుకుని.. ఎన్నికల్లో తప్పులు చేయకూడదని తీసుకునే నిర్ణయాలకు సహకరించాలి. టికెట్‌ వచ్చినా రాకపోయినా మీరు నా మనుషులే. 175కి 175 స్థానాలు సాధ్యమే. క్షేత్రస్థాయిలో మనకు సానుకూల సంకేతాలు ఉన్నాయి. కాబట్టే ప్రతిపక్షాలు ఒంటరిగా రావడానికి భయపడి పొత్తుల కోసం వెతుక్కుంటున్నాయి. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్యం, ఇదే ముందు చూపు, ప్రణాళికతో అడుగులు వేయాలి. మండల, గ్రామ స్థాయిలో నాయకులతో విభేదాలను వెంటనే పరిష్కరించుకోండి’’ అని సూచించారు.

మళ్ళీ ఆంధ్రాకి జగనే కావాలి !

‘ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి’ అనే పార్టీ కార్యక్రమాన్ని అయిదు దశల్లో నిర్వహించనున్నట్లు ఐప్యాక్‌ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్‌ ప్రజంటేషన్‌లో వివరించారు. ప్రభుత్వపరంగా చేపట్టే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ గురించి కూడా ఆయనే వివరించారు. మధ్యమధ్యలో కొన్ని అంశాలను సీఎం ప్రస్తావించారు. ‘‘వచ్చే రెండు నెలలు ఈ కార్యక్రమాలను ఎగ్రెసివ్‌గా చేపట్టాలి. వీటిలో వాలంటీర్లు, జగనన్న గృహ సారథులు అందరినీ భాగస్వాములను చేయనున్నాం. గడప గడపకు మన ప్రభుత్వంతో పాటే వీటినీ కొనసాగించాలి. నవంబరుతో గడప గడప కార్యక్రమాన్ని ముగిద్దాం. తర్వాత ఎన్నికల ప్రత్యేక కార్యాచరణ ఉంటుంది. ఆరోగ్యసురక్ష కార్యక్రమంలో ప్రతి ఇంటికీ వెళ్లి జనం ఆరోగ్యంపై జల్లెడపడతారు. ఉచితంగా పరీక్షలు, మందులతో పాటు దీర్ఘకాలిక సమస్యలున్న వారికి తర్వాత అవసరమైన వైద్య సేవలందించడం కూడా ఇందులో ఉంటుంది’’ అని జగన్‌ ప్రకటించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !