ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తే వెన్నుముక. పార్టీ అధికారంలోకి రావాలన్నా, పదికాలాల పాటు అధికారాన్ని చలాయించాలన్నా కార్యకర్తలదే ప్రధాన పాత్ర. కానీ పార్టీ మనుగడకు కారణమువుతన్న కార్యకర్త ఓడిపోతున్నాడు. కష్టం కార్యకర్తలది, భోగం నాయకులది అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా, కుటుంబానికి దూరం అయ్యి, విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ, జెండా పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ, బ్యానర్లు, ఫ్లెక్లీలు కడుతూ, నలుగురిని కూడకట్టుకుని నాయకులకు భుజానికి ఎత్తుకుని జై కొడితే...కార్యకర్తలకు మిగిలుతున్నది ఏమిటి ? దక్కుతున్నది ఏమిటి ? పార్టీలన్నీ కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారు. అసలు కార్యకర్త అనే వాడు జెండా పట్టుకోకుంటే పార్టీలకు ఉనికి ఎక్కడిది ? పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, పార్టీనే నమ్ముకుని, పార్టీ కోసం సర్వస్యం త్యాగం చేసిన ఎందరో కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు లేక, ఎప్పటికీ కార్యకర్తగానే మిగిలిపోతున్నాడు.
ఎన్ని రోజులు నాయకుల పల్లకీలు మోయాలి ?
పార్టీ ఏదైనా రెండోసారి, 3 వ సారి, 4 వ సారి, 5 వ సారి పోటీ చేయాలనే పరితపిస్తున్నారు. వారు లేకుంటే తన కొడుకో, కూతురో పార్టీ నుండి పోటీలో నిలబడాలని ఆశించే నాయకులే అన్ని చోట్ల కనిపిస్తున్నారు. ఇలా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు వీళ్ళకే ఛాన్సులు ఇస్తూ పోతూ ఉంటే మిగిలిన కార్యకర్తలు నాయకులుగా ఎదిగేదెప్పుడు ? తరాలు మారినా కార్యకర్తలు కార్యకర్తలుగా ఉండిపోవాలా? వాళ్ళ పల్లకీలు మోస్తూనే ఉండాలా ? ఇంకెప్పుడు వస్తాయి కార్యకర్తలకి అవకాశాలు ? కార్యకర్తల స్థాయి నుండి కనీసం 5% మంది కూడా నాయకులుగా ఎదగలేకపోతున్నారు. ఇంకెంతకాలం ఈ దౌర్భాగ్యం. కార్యకర్తలారా...ఆలోచించండి. డబ్బు, సమయం వృధా చేసుకోకండి. ఉద్యోగాల వైపు, వ్యాపారాల వైపు వెళితే మీ కుటుంబాలకు కనీస గౌరవ మర్యాదలు దక్కుతాయి.
డబ్బు ఉన్నోళ్లకే రాజకీయాలు !
అవునన్నా కాదన్నా రాజకీయాలు డబ్బు చూట్టూనే తిరుగుతున్నాయి. డబ్బు ఉన్నోళ్ళకే పరిమితం అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. డబ్బులేని సామాన్య కార్యకర్తలు పార్టీనే నమ్ముకుని మోహమాటం, పరువు కోసం పాకులాడుతూ ఒక్క పార్టీనే అంటి పెట్టుకుని ఉండిపోతే, డబ్బున్న ద్వితీయ శ్రేణి నాయకులు అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరి తమ ప్రాబల్యంతో సామాన్య కార్యకర్తలను ఆవేదనకు గురి చేస్తున్నారు. రాజకీయ నాయకులు పార్టీలు మారినంత ఈజీగా కార్యకర్తలు జెండాలు మార్చలేకపోతున్నారు. అధికార పక్షం అయినా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా డబ్బులేని సామాన్య కార్యకర్తకు అసలు విలువ లేదు. గుర్తింపు లేదు. అలాంటప్పుడు ఓ కార్యకర్తా...నీకేందుకు ఈ అనవసరపు ఆరాటం, కేవలం వృధా ప్రయాసే. పార్టీ కోసం నిరంతరం కష్టపడి ఎలాంటి గుర్తింపు లేక పార్టీలకు దూరంగా ఉంటున్న కార్యకర్తలు ఎందరో. పార్టీల కోసం పోరాడినందుకు వేధింపులు, అక్రమ కేసులు, అరెస్టులు. కనీసం ఇప్పటికైనా గ్రామ స్థాయిలోనూ నిజాయితీపరులైన పార్టీ కార్యకర్తలను గుర్తించి వారికి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏంతైనా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లులను ఎంత దూరం పెడితే పార్టీలు అంత బాగుంటాయి అనటంలో సందేహం లేదు.