ఇప్పటికే ఓ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌ని ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ రెండు పిటిషన్‌లు దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్ పిటిషన్ వేయగా.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ నమోదు చేసిన కేసులో చంద్రబాబును కస్టడీకి కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు అందులో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఇవాళే ఆ పిటిషన్ వెయ్యాలి అనుకుంటోంది. ఐతే.. ఇవాళ వేసినా, దానిపై రేపు విచారణ జరగవచ్చు అని తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉండటం వల్ల.. పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) రూపంలో ఈ పిటిషన్ వేయబోతున్నట్లు తెలిసింది.
ఈ కేసు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఇది 2022లో నమోదైంది. ఈ కేసును సీఐడీ నమోదుచేసింది. ఈ కేసులో భారీ భూ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు తెరతీస్తూ... రింగ్ రోడ్ ఎలైన్‌మెంట్ కూడా మార్చారనీ, అలాగే.. ముందే స్థలాలు కొనేసి... ఆ మార్గంలో రింగ్ రోడ్ వచ్చేలా చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా 2014లో ఏపీ మంత్రిగా ఉన్న నారాయణ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐతే.. దీని వెనక కూడా చంద్రబాబు హస్తం ఉండి ఉండొచ్చని సీఐడీ భావిస్తోంది. ఈ కేసులో చంద్రబాబును ప్రశ్నించేందుకు అనుమతి లభిస్తే... ఆయన్ని ప్రశ్నించేందుకు సీఐడీ సిద్ధంగా ఉంది. అందుకు అనుమతి లభిస్తే... ఇప్పటికే ఓ కేసులో విచారణను ఎదుర్కొంటున్న చంద్రబాబుకి.. ఈ కేసు సమస్యగా మారే అవకాశం ఉంది.అమరావతి కేపిటల్ ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ కేసులో సీఐడీ ఆల్రెడీ దర్యాప్తు చేసి.. రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఐతే.. అప్పట్లో తీర్పు ఇవ్వకుండా.. నిందితులు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో.. తీర్పు రిజర్వులో ఉంది. ఈ కేసులో ఇప్పటివరకూ చంద్రబాబును ప్రశ్నించలేదు. కానీ ఇప్పుడు ప్రశ్నిస్తే... చాలా విషయాలు బయటకు వస్తాయి అని సీఐడీ భావిస్తోంది.
వరుస కేసులతో అష్టదిగ్భదనం !
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో పాటుగా అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో మరో వారెంట్ పిటిషన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే 3 నెలల కాలంలో చంద్రబాబు, లోకేష్ మరియు ఇతర నాయకుల్ని కేసుల పేరుతో న్యాయస్థానాలు మరియు జైళ్ళ చుట్టూ తిప్పితూ మిగిలిన ద్వితీయ శ్రేణి నాయకుల్ని భయభ్రాంతులకు గురిచేయటమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లోపు మిని జమిలి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉండటంతో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ తప్పిదాలను, స్కామ్‌లను బయటకు తీసి ఇబ్బందులకు గురిచేయటమే లక్ష్యంగా ప్రభుత్వం తన కార్యచరణను ప్రారంభించిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం వైసీపీ తన అస్త్రశస్త్రాలను సిద్ధం కోసుకుంటోందని తెలుస్తోంది. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీకి నాయకుడి, సేనాని లేకుండా చేస్తే కేడర్ కకావికలం చేయటమే వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌గా తెలుస్తోందని పార్టీ శ్రేణులే ఆవేదన వెళ్ళబుచ్చుతున్నాయి.