తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడుతున్నట్లు స్వయంగా ప్రకటించినప్పటికీ...కొద్దీ రోజులుగా పార్టీ పట్ల ఎందుకో సరిగ్గా పట్టించుకుంటున్నట్లు లేదు. అందరూ ఇదంతా ఫేక్ అని మాట్లాడుకున్నారు. కానీ పార్టీ పెట్టిన విషయం నిజమే అని పక్కాగా తెలుస్తుంది. ఎందుకంటే తాజాగా తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో తీన్మార్ మల్లన్న ఈసీకి అప్లై చేసుకున్నారు. పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30లోగా తెలియజేయాలని ఈసీ తన వెబ్సైట్ లో పేర్కొంది. గత ఏప్రిల్ లో పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ఈ పార్టీ కార్యదర్శిగా మాదం రజినీ కుమార్ (వరంగల్ జిల్లా,ధర్మసాగర్), కోశాధికారిగా ఆర్.భావన(చంపాపేట్, సరూర్ నగర్) ఉంటారని ఆయన దరఖాస్తులో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు నెలల్లోని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఇప్పటికే బిఆర్‌ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్ధం కాగా.. కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో తీన్మార్ మల్లన్న సైతం సొంత పార్టీతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
తెలంగాణ నిర్మాణ పార్టీ
తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. 1982, జనవరి 17న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, మాధాపురం గ్రామంలో జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాదు జె.ఎన్.టి.యు నుండి 2009లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత పలు న్యూస్ చానెల్స్‌లలో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2012లో వి6 న్యూస్ లో ప్రసారమైన తీన్మార్ వార్తలు ద్వారా నవీన్ కాస్త తీన్మార్ మల్లన్నగా సుపరిచితుడయ్యాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ ,ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత 2019లో జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. 2021, మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ,ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి ఓటమిపాలయ్యాడు. 7 డిసెంబర్ 2021న ఢల్లీిలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. కానీ ఆ తర్వాత వెంటనే బిజెపి నుండి బయటకు వచ్చారు. ప్రస్తుతం క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ తో పాటు మరో న్యూస్ పేపర్‌ను విజయవంతంగా నడిసిస్తున్నారు. రాజకీయాల్లో తనకంటూ స్థానం సంపాదించుకోవాలని మల్లన్న ఎంతగానో కష్టపడుతున్నాడు కానీ అదృష్టం కలిసిరావడం లేదు. మరి ఇప్పుడు సొంత పార్టీ ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు.
ప్రజల తరపున పోరాడే నిఖర్సైన నాయకుడు !
తెలంగాణ వ్యాప్తంగా తన మీడియాతో ప్రభుత్వాన్ని నిలదీస్తూ, పేద, మధ్య తరగతి ప్రజల గళంగా మారి వారి సమస్యలను ప్రపంచానికి చూపుతూ, తనదైన శైలిలో సేవా, సహాయ కార్యక్రమాలు చేస్తున్న తీన్మార్ మల్లన్న ఈ సారి తన సొంత పార్టీ తెలంగాణ నిర్మాణ పార్టీతో పోటీ చేయబోతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇతర ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి బలమైన అభ్యర్థులు లేకపోయినప్పటికీ... పార్టీల నుండి ఇతరుల పోటీ కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే ప్రమాదం ఉంది. ముఖాముఖీ పోటీకి ఇతర పార్టీలు సహకరించినట్లయితే మల్లన్న గెలుపు నల్లేరు మీద నడకే అని మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న మల్లన్న తన సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. ఇప్పటికీ తన మీడియా ద్వారా కాంగ్రెస్, బీజేపీ పార్టీలను అభ్యర్థించారు. మేడ్చల్‌లో మరెవ్వరినీ పోటీకి నిలపకుండా సహాకరించాలని కోరారు. అధికార పక్షాన్ని నిలదీసే మల్లన్న లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఒకరు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం ఈ సారి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో.