Telangana elections : తెలంగాణలో ఆ పార్టీకే అధికారం !

0

 


తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏ క్షణమైనా ఎన్నికల తేదీని ప్రకటించనుంది ఎన్నికల కమీషన్‌. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు అనే సంకేతాలు వినిపిస్తుండడంతో పార్టీలన్నీ తమ అదృష్టాన్ని పరీక్షించకునేందుకు సమాయత్తమవుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జనలు పడుతోంది. ఈ క్రమంలో ప్రధానంగా పోటీ అటు బీఆర్‌ఎస్‌, ఇటు కాంగ్రెస్‌ మధ్య ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిజెపి, ఎంఐఎం పాత్రను కూడా తక్కువ చేసి చూడలేమని అంటున్నారు. ఎన్నికలు అన్నాక సర్వేలు సాధారణం కాబట్టి.. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక సంస్థ కీలక వివరాలను ప్రకటించింది.

జన్మత్‌ సర్వే

కర్ణాటక ఎన్నికల సమయంలో ఓటరు నాడిని పట్టుకునేందుకు జన్మత్‌ అనే సంస్థ సర్వే నిర్వహించింది. అది ఫలితాలకు అత్యంత దగ్గరగా ఉన్న గణాంకాలు విడుదల చేసింది. ఇదే సంస్థ తెలంగాణ ఎన్నికల సర్వే కూడా నిర్వహించింది. అయితే తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఆ సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం తెలంగాణ శాసనసభలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి 58 నుంచి 60 సీట్లు వస్తాయి. అధికార బీఆర్‌ఎస్‌కు 43 నుంచి 45 సీట్లు వస్తాయి. జీజేపీ ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు గెలుచుకుంటుంది. ఎంఐఎం ఆరు నుంచి ఏడు సీట్లు సాధిస్తుంది. కొంత మంది నాయకులు పార్టీలకు అతీతంగా రెండు లేదా మూడు స్థానాల్లో విజయం సాధిస్తారు’’ అని జన్మత్‌ సంస్థ తన సర్వేలో ప్రకటించింది. 

అసలు ఫలితం ఎన్నికల తర్వాతే

ఇదిలా ఉంటే ఇప్పటికే దేశంలోనే ప్రముఖ సర్వే సంస్థలు ఇప్పటికే తమతమ సర్వేలను ప్రకటించాయి. కొన్ని సంస్థలు మాత్రం బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని ప్రకటిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి 80 నుంచి 90 స్థానాలు సాధించి మూడవసారి అధికారం చేపడుతుందని ఇండియా టుడే, ఇంకా కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. ఇండియా టుడే చేసిన సర్వే ఏదీ కూడా వాస్తవానికి దగ్గరగా రాలేదు.. చివరికి గుజరాత్‌ ఎన్నికల్లో కూడా బిజెపి గెలవదని ఆ సంస్థ ప్రకటించింది. చివరికి ఆ సంస్థ చేసిన సర్వేకు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. ఏది ఏమైనప్పటికీ త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అధికారం మీద కన్నేశాయి. సంస్థలు మాత్రం తమకు నచ్చిన విధంగా ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఓటర్లు ఓటు వేసిన తర్వాతే అసలు ఫలితం తేలుతుంది కాబట్టి.. ప్రస్తుతానికి ఈ సర్వే సంస్థల వివరాలను బేరీజు వేసుకోవడం మాత్రం పార్టీలవంతవుతున్నది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !