Model Code of Conduct : ఎలక్షన్‌ కోడ్‌ అంటే ఏమిటి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

0

ఎన్నికలు తేదీ ప్రకటించిన సమయం నుండి ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుంది. అసలు ఎన్నికల కోడ్‌  అంటే ఏమటి ? అది అమలులో ఉంటే ప్రజలు, నాయకులు ఎలాంటి నిబంధనలు అనుసరించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలే కాదు సామాన్యులు కూడా ఎన్నికల కోడ్‌పై అప్రమత్తంగా ఉండాలి. నిష్పక్షపాత ఎన్నికల కోసం ఎలక్షన్‌ కమిషన్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తోంది. దీన్నే ఎన్నికల కోడ్‌ అంటారు. అంటే ప్రతి ఒక్కరూ కొన్ని నిబంధనలకు అనుసరించి నడుచుకోవాల్సివుంటుంది. కోడ్‌ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కోరి చిక్కులు తెచ్చుకున్నట్లే అంటున్నారు అధికారులు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఏం చెబుతోందో చూద్దాం. ఎన్నికల కోడ్‌ అంటే రాజకీయ నాయకులు, పార్టీలకే కదా.. మనకేం ఇబ్బంది ఉంటుంది అని అంతా అనుకుంటారు. కానీ, కొన్నిసార్లు సామాన్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. తప్పు చేయకపోయినా.. అధికారులకు సమాధానం చెప్పాల్సి రావొచ్చు. ముఖ్యంగా ఎన్నికల కోడ్‌ వల్ల నగదు రవాణాపై ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఉండటంతో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇందులో సామాన్యుల డబ్బు కొంత వుంటుంది. సరైన పత్రాలు లేకపోతే.. ఎవరి డబ్బైనా అధికారులు స్వాధీనం చేసుకోవాల్సిందేనని నిబంధనలు సూచిస్తున్నాయి. అందుకే ఎవరైనా సరే పత్రాలు ఉంటేనే పైసలు రవాణా చేయాలి. 50 వేల రూపాయలకన్నా ఒక్క పైసా ఎక్కువ మీ వద్ద ఉన్నా అధికారులను పూర్తిగా వివరణ ఇవ్వాల్సిందే.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందీ? ఎక్కడికి తీసుకువెళుతుంది? ఏం చేస్తుంది? పూర్తిగా చెప్పాల్సిందే. మీ సమాధానంలో తేడా ఉన్నా.. చెప్పినదాంట్లో వాస్తవం లేకపోయినా ఆ డబ్బును అధికారులు స్వాధీనం చేసుకుంటారు. సరైన పత్రాలు చూపించాకే మీ నగదు మీకు తిరిగి అప్పగిస్తారు. అంతవరకు కోర్టు కస్టడీలో మీ సొమ్ము జమ చేస్తారు.

ధృవపత్రాలు తప్పనిసరి !

తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్‌ 3 ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు ఈ నిబంధన పక్కాగా అమలు అవుతుంది. నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న తెలంగాణలో మొత్తం 148 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్‌.. ఈ చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో నగదు భారీగా లభిస్తే ఆదాయపన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చి కోర్టుకు అప్పగించాలని నిబంధనలు చెబుతున్నాయి. లక్ష, రెండు లక్షలు దొరికితే రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. డబ్బు ఏదైనా సరే లెక్క మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఎన్నికలు ముగిసేవరకు నగదుకు సంబంధించిన ఆధారాలు, ధృవపత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. భూ విక్రయాలు, ధాన్యం అమ్మకాలు నుంచి వచ్చిన డబ్బైనా సరే తగిన పత్రాలు లేకపోతే అధికారులు స్వాధీనం చేసుకుంటారు. మెడికల్‌ ఎమర్జెన్సీ, పిల్లల స్కూళ్లు, కాలేజీ ఫీజులకు నగదు చెల్లించాల్సివచ్చినా సంబంధిత పత్రాలు మీతోనే ఉంచుకోవడం మేలు. ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా.. డబ్బును అధికారులు జమచేసుకుంటారు. ఒకసారి అధికారులు జమ చేసుకున్న తర్వాత మళ్లీ తిరిగి ఇవ్వాలంటే ఎన్నో నిబంధనలు అనుసరించాల్సి వస్తుంది. అందుకే ముందుగానే జాగ్రత్తగా ఉండాలని.. తగిన పేపర్లు వెంటే ఉంచుకోవాలని సూచిస్తోంది ఎన్నికల కమిషన్‌. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బైనా సరే పక్కాగా లెక్క చూపాల్సిందే.. నల్లధనం తరలింపునకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది ఈసీ.ఎన్నికల కోడ్‌ కింద ఒక్క నగదే కాదు.. బంగారం, వెండి, వజ్రాభరణాలు, విలువైన వస్తువులు ఇలా ఏవైనా సరే.. అనుమానం వస్తే స్వాధీనం చేసుకుంటారు అధికారులు. అలా స్వాధీనం చేసుకున్న నగలు, ఆభరణాలను సంబంధిత శాఖలకు అప్పగిస్తారు. బంగారం, వెండి వర్తకులు సైతం ఇకపై తగిన పత్రాలు పట్టుకునే ప్రయాణాలు చేయాల్సివుంటుంది. లేదంటే లేనిపోని చిక్కులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు అధికారులు.. సో సామాన్యులైనా.. వ్యాపారులైనా.. ఎన్నికలతో సంబంధం లేకపోయానా కోడ్‌ అమలులో ఉన్నందున తస్మాత్‌ జాగ్రత్త.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !