CBN Concert : బండ్ల గణేష్‌ తీవ్ర భావోద్వేగం !

0

హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి బాటలు పరిచిన సైబర్‌ టవర్స్‌ రజతోత్సవాలు గచ్చిబౌలి స్టేడియంలో వైభవంగా జరిగింది. 25 ఏళ్ల క్రితం సైబర్‌ టవర్స్‌ ప్రారంభాన్ని గుర్తుచేసుకుంటూ ఐటీ ప్రొఫెషనల్స్‌ ఘనంగా కార్యక్రమం చేపట్టారు. వేలాది మంది ఐటీ ప్రొఫెషనల్స్‌, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సైబర్‌ టవర్స్‌ రూపశిల్పి చంద్రబాబు సేవలను కొనియాడారు. ఐటీ ఉద్యోగులు, టీడీపీ అభిమానులు తరలివచ్చి.. చంద్రబాబు ముందుచూపు, పాలన దక్షతను గుర్తుచేసుకున్నారు. జై బాబు, వియ్‌ ఆర్‌ విత్‌ సిబిఎన్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సైబర్‌ టవర్స్‌, ఐటీ అభివృద్ధిపై కార్యక్రమ నిర్వాహకులు ప్రత్యేక వీడియోలు విడుదల చేశారు. సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సంగీత విభావరి ఆకట్టుకుంది.


బండ్ల గణేష్‌ భావోద్వేగం 

నాలుగు వేల ఏళ్లైనా చంద్రబాబు గొప్పతనం గుర్తుంటుందని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు నిర్వహించిన  ‘సీబీఎన్‌ గ్రాటిట్యూడ్‌ కాన్సర్ట్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు పేరు మాత్రమే కాదని.. ఓ బ్రాండ్‌ అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కఠోరంగా శ్రమించడమే చంద్రబాబు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. ఆయన్ను జైల్లో పెట్టడం బాధగా ఉందంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.  కొద్దిసేపటి వరకు స్టేజీపై అలానే ఏడుస్తూ ఉండిపోయారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉండడంతో నేను వినాయకచవితి పండుగ చేసుకోలేదు, దసరా పండుగ చేసుకోలేదు... దీపావళి పండుగ అద్భుతంగా చేసుకునే అవకాశం కల్పించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను. చంద్రబాబు... అది పేరు కాదు బ్రాండ్‌. బ్రాండ్‌ కూడా కాదు, మనిషి కూడా కాదు... దేవుడు. ఆయన దేవుడు అని ఎందుకు చెబుతున్నానంటే... మా సొంతూరు ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర్లోని ఓ ఊరు. నాకు ఎనిమిది నెలల వయసున్నప్పుడు మేం అక్కడ్నించి బతకడానికి ఎక్కడికో వలస వచ్చాం. అప్పుడప్పుడు మా ఊరికి వెళ్లొస్తుండేవాడ్ని. మా బంధువులందరూ పాడి పశువులతో ఉపాధి పొందుతూ, గుంటూరు, పొన్నూరులో ఉంటూ పిల్లలను ట్యూషన్‌ చేర్పించి చదువు చెప్పించేవాళ్లు.  కొన్నాళ్ల తర్వాత చూస్తే... మా ఊరి నుంచి పొన్నూరుకు కాలినడకన, ఆటోల్లో వచ్చే మా పిన్ని వాళ్లు విమానాలెక్కి అమెరికా వెళుతున్నారు. ఏం పిన్ని ఎక్కడికి వెళుతున్నావు అంటే... అమ్మాయి సాఫ్ట్‌ వేర్‌ కదరా, అల్లుడు సాఫ్ట్‌ వేర్‌ కదరా... అమెరికా వెళుతున్నాను అని చెబుతుంటే కడుపు నిండిపోయినట్టయ్యేది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటూ... ఇవాళ మనవాళ్లు దేశవిదేశాల్లో ఐటీ ఉద్యోగాలతో బతుకుతున్నారంటూ దాని వెనుక చంద్రబాబు కృషి ఉంది. మా నాన్న వయసు 78 ఏళ్లు. చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేశార్రా అని ఆయన అడిగారు. నాన్నా... కులీకుతుబ్‌ షా హైదరాబాద్‌ ను కట్టాడు... 400 ఏళ్లయినా ఆయన పేరు చెప్పుకుంటున్నారు. అలాగే సైబర్‌ టవర్స్‌ కట్టిన చంద్రబాబును 4 వేల ఏళ్లయినా గుర్తుంచుకుంటారు అని చెప్పాను. 

చంద్రబాబు దేశానికి అవసరం

శ్రీకృష్ణుడు అంతటివాడికి కూడా జైలే జన్మస్థానం అయింది... శ్రీకృష్ణుడు దేవుడు కాకుండా పోయాడా!... అరణ్యవాసం వెళ్లిన రాముడు దేవుడు కాకుండా పోయాడా!... 40 రోజులుగా జైల్లో ఉన్నంత మాత్రాన చంద్రబాబు దేవుడు కాకుండా పోతాడా నాన్నా అని అన్నాను. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు జై అంటున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, హైదరాబాదులో, ఢల్లీిలో ఆయనకు జై కొడుతున్నారు. కానీ చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉంటే కడుపు తరుక్కుపోతోంది. ఏం తప్పు చేశాడని ఆయనను జైల్లో పెట్టారు? మనందరికి భవిష్యత్‌ ఇచ్చినందుకా ఆయన జైల్లో ఉండాలి? ఆఖరికి భార్యాబిడ్డలను కూడా పక్కనబెట్టి ప్రజల కోసం పాటుపడిన చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చిందంటే కడుపు రగిలిపోతోంది. చంద్రబాబు కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమే. అలాంటి వ్యక్తి దేశానికి అవసరం’’ అంటూ బండ్ల గణేశ్‌ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !