కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపిస్తూ ఆయన పార్టీని వీడారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. పార్టీలో చోటుచేసుకుంటున్న వ్యాపార రాజకీయాలతో తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పరువు పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపారు. అంతేకాదు..
కాంగ్రెస్‌లో బీసీలకు ప్రాధాన్యత లేదు.
‘‘కొందరు నేతల వైఖరితో పార్టీ పరువు మట్టిలో కలుస్తోంది. ఉదయ్‌పుర్ డిక్లరేషన్ అమలు చేయడం లేదు. అవమానాలు ఎదుర్కొని పార్టీలో ఉండలేను. సీనియర్లకు కూడా అధిష్ఠానం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. నెలల తరబడి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించారు. అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. నాలాంటి ఒక సీనియర్ నాయకుడు పార్టీ అంశాలు చర్చించాలంటే నెలల తరబడి అపాయింట్‌మెంట్ కోసం వేచిచూడడం దురదృష్టకరం. నేను దిల్లీకి వచ్చి 10 రోజులైనా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారిని కలుద్దామంటే ఒక్క నిమిషం సమయం ఇవ్వలేదు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీట్లు కేటాయించాలని కోరేందుకు దిల్లీకి వెళ్తే సమయం ఇవ్వకపోవడం చాలా అవమానకరం. 2001లో తెలంగాణ కోసం 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపితే.. వారిలో మొదటి సంతకం పెట్టింది నేను. తెలంగాణ కోసం మొదటి నుంచి నా వంతు చిత్తశుద్ధితో పనిచేశాను. రాష్ట్రంలో 18 ఏళ్లు మంత్రిగా అనేక శాఖలను నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డాను. పార్టీ కోసం అంకితభావంతో 40 ఏళ్లుగా పని చేసిన నాకే ఇంత అవమానం జరిగితే.. పార్టీలో సగటు బీసీ నేత పరిస్థితి ఊహిస్తేనే భయంగా ఉంది. కొంత మంది పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతూనే.. మరోవైపు పార్టీని అమ్మకానికి పెట్టి ఒక వ్యాపార వస్తువుగా మార్చేశారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది’’ అని పొన్నాల వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా తనకు అన్నివిధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికీ పొన్నాల ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్‌ఎస్ వైపు పొన్నాల చూపు ?
మరోవైపు పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జనగామ టికెట్ దక్కదనే కారణంతో పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు సమాచారం. మరి పొన్నాల బీఆర్‌ఎస్‌లో చేరితో జనగామ టికెట్ ఇస్తారా? బీఆర్‌ఎస్ టిక్కెట్‌ను పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇస్తున్నట్లు ఇప్పటికే సంకేతాలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రాకపోయినా.. బహిరంగంగా అదే టాక్ నడుస్తోంది. ముత్తిరెడ్డిని కాదని మరీ.. పల్లా వైపే బీఆర్‌ఎస్ అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఇప్పుడు పొన్నాల రాకతో జనగామ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.