అమరావతి అసైన్డ్ భూముల కేసులో బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో సీఐడీకి సరికొత్త ఆధారాలు చిక్కాయి. అమరావతి అసైన్డ్ భూముల కేసును మళ్లీ ఓపెన్ చేస్తూ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ రెండు పిటిషన్లు ఫైల్ చేసింది. ఈ మేరకు సీఐడీకి మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ ఆడియో, వీడియో ఆధారాలు అందజేశారు. ఇందులో నారాయణ, తదితరులు ఏ విధంగా అక్రమంగా భూములు కొనుగోలు చేసింది. ఎసైన్డ్ భూములున్న దళితులు, ఇతర బలహీనవర్గాలవారిని అధికార దర్పంతో బలంతో ఏ విధంగా బెదిరించారు.. ఏ విధంగా వాటిని కాజేశారు అనే విషయాలను కృష్ణప్రియ వివరించినట్టుగా తెలుస్తోంది.
రీ-ఓపెన్ చేస్తూ కోర్టులో పిటిషన్
ఈ నేపథ్యంలో కేసును రీ-ఓపెన్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు సీఐడీ అధికారులు.. వాస్తవానికి ఆ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని పేర్కొంటూ ఈ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో విచారణ ముగియగా తీర్పును హైకోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఎల్లుండి సోమవారం తీర్పు రానున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ కేసును రీ ఓపెన్ చేయాలంటూ సీఐడీ పిటిషన్ వేయడం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. కాగా, రాజధానిలో అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగింది అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు 2021 మార్చి 12వ తేదీన కేసు నమోదు చేశారు.. ఈ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి పొంగూరు నారాయణల మీద అభియోగాలు నమోదయ్యాయి. అయితే, ఈ కేసు విచారణ జరగకుండా 2021 మార్చి 19న హైకోర్టు స్టే విధించింది.. మరోవైపు.. ఈ కేసును కొట్టేయాలంటూ నారాయణ సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.. ఆ పిటిషన్ మీద విచారణ పూర్తవగా అక్టోబర్ 16 తేదీకి తీర్పు వాయిదా వేసింది న్యాయస్థానం.. ఈ క్రమంలోనే కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ వేయడంతో చర్చగా మారింది.
కేబినెట్ ఆమోదం లేకుండానే జీఓ..
అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు ఈ జీఓ`41 జారీచేయడం వెనుకనున్న కుట్ర కోణం సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజానికి.. రాజధాని అమరావతి ఏర్పాటుకోసం చంద్రబాబు ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం సీఆర్‌డీఏ పరిధిలో భూవ్యవహారాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కానీ, అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టం 1977కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం జీఓ`41ను తీసుకొచ్చింది. అందుకు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు. కేబినెట్‌లో చర్చించకుండానే ఏకపక్షంగా జీఓ`41ను అడ్డదారిలో జారీచేసేసింది. ఎందుకంటే కేబినెట్‌లో తీర్మానం చేయాలంటే అందుకు నిబంధనలు అంగీకరించవు. అందుకే కేబినెట్‌ను బైపాస్ చేసి జీఓ జారీచేసింది. తద్వారా.. మంత్రివర్గం ఆమోదంతోనే భూవ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవాలన్న సీఆర్‌డీఏ చట్టాన్ని సైతం ఉల్లంఘించింది.
చంద్రబాబు, నారాయణే కుట్రదారులు..
ఇక నిబంధనలకు విరుద్ధంగా జీఓ`41ను అప్పటి పురపాలక, సీఆర్‌డీఏ శాఖ మంత్రి పొంగూరు నారాయణ 2016, ఫిబ్రవరి 29న ఆమోదించారు. అనంతరం 2016, మార్చి 22న సీఎం హోదాలో చంద్రబాబు పోస్ట్ ఫాక్టో రాటిఫికేషన్ చేసి మరీ ఆమోదించారు. అంటే.. అసైన్డ్ భూములు కొల్లగొట్టేందుకు జీఓ` 41 కుట్ర పూర్తిగా చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే సాగింది. ఈ కీలక అంశాలను అప్పటి ఉన్నతాధికారులు సిట్ దర్యాప్తులో వెల్లడిరచినట్లు సమాచారం. ఈ మేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్, సీఆర్‌డీఏ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు. అసైన్డ్ చట్టానికి విరుద్ధమైనప్పటికీ చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే జీఓ`41 జారీచేయాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. అలా జారీచేసిన జీఓ`41తో అమరావతి పరిధిలోని 950 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. తమ భూదాహం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల పొట్టకొట్టారు.