- ఫ్లాట్స్ అమ్ముడుపోక తలలు పట్టుకుంటున్న నిర్మాణదారులు !
- అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఎక్కువ అంటున్న అపార్ట్‌మెంట్ వాసులు.
- మందకొడిగా సాగుతున్న నిర్మాణాలు !
ఉప్పల్ భగాయత్ లేఅవుట్ హెచ్‌ఎండిఏకి కాసులు కురిపించింది. కానీ భగాయత్ లేఅవుట్ `1లో సొంతం చేసుకున్న యజమానులకు కన్నీరు తెప్పిస్తోంది. భగాయత్ లేఅవుట్‌కి ఒక వైపు పూర్తిగా మూసీ నది ప్రవహిస్తుండటంతో భరించలేని దుర్గంధం వెదజల్లుతోంది. అదే విధంగా లేఅవుట్‌కి మరో రెండు వైపులా కాలనీల్లో నుండి వచ్చే నాలా నీరు లే అవుట్‌లో నుండే మూసీలో కలుస్తోంది. దీంతో చిన్న పాటి వర్షం వస్తే చాలు రోడ్లు డ్రైనేజీ వాటర్‌తో నిండిపోతున్నాయి. లే అవుట్ మునిసిపోతుంది. మరోవైపు నాగోలు మెట్రో కి అనుకుని ఉన్న జీహెచ్‌ఎంసీ చెత్త తరలింపు కేంద్రం నుండి దుర్గంధం చుట్టు ప్రక్కలకు వ్యాపిస్తోంది.
కొని ఇరుక్కుపోయాము
మూడు వైపులా నాలాలు ప్రవహిస్తుండటంతో నివాసానికి అంత యోగ్యంగా లేదని భగాయత్‌లో అపార్ట్‌మెంట్‌లో ప్లాట్లు కొన్న వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే బోరు వాటర్ కూడా బాలేదని వాడుకోవడానికి కష్టంగా ఉందని, విధిలేని పరిస్థితుల్లో వాడితున్న వారు వివిధ రకాల స్కిన్ అలర్జీలతో బాధపడుతున్నామని వాపోతున్నారు. ఎండలు ఎక్కువ ఉన్న పగటి సమయంలో గాలిలో తేమ కారణంగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవటంతోపాటు శరీరం చమట కారణంగా దుర్వాసన వస్తోందని తెలుపుతున్నారు. సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన తర్వాత హాయిగా గడుపుదామని బయటకు వచ్చి బాల్కనీ కూర్చొనే పరిస్థితి లేదని మూసీ కంపుతో అల్లాడిపోతున్నామంటున్నారు. ప్లాట్ కొనుక్కుని తప్పు చేశాం, ఇప్పుడు అమ్ముకోలేము మరోచోటకి వెళ్లలేము, ఇరుక్కుపోయాము అని బాధను వెళ్ళగక్కుతున్నారు. ఎన్నో అశలు పెట్టుకుని అపార్ట్‌మెంట్‌లు మొదలుపెట్టిన యజమానులు అమ్ముడుపోక తలలు పట్టుకుంటున్నారు. గజం 75 వేలకు పైగా ఉండటంతో అపార్ట్‌మెంట్ రేట్లు కూడా భారీగానే ఉన్నాయి.