BRS : ముదిరాజ్‌లకు గాలం...బీఆర్‌ఎస్‌ సరికొత్త వ్యూహం !

0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏ పార్టీకా పార్టీ తమ విజయం కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తుండగా.. బీఆర్‌ఎస్‌ అయితే జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. అయితే.. అన్ని వర్గాల వారిని సంతృప్తిపరుస్తూ.. కారు పార్టీ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో.. ఎవరైనా అసంతృప్తితో ఉన్నారని తెలిసినా.. బహిరంగంగా వ్యతిరేకత తెలిపినా.. అలాంటి వారిని బుజ్జగించి తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఈ క్రమంలోనే ముదిరాజ్‌ వర్గానికి చెందిన బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవికుమార్‌తో ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. బిత్తిరి సత్తితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన ముదిరాజ్‌ మహాసభ ఆధ్వర్యంలో బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవికుమార్‌.. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. బిత్తిరి సత్తి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఒకప్పుడు తాను బిత్తిరి సత్తిగా మాట్లాడానని.. కానీ ఇప్పుడు ముదిరాజు రవికుమార్‌గా మాట్లాడుతున్నానంటూ సభలో ప్రసంగించారు. ముదిరాజులకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందన్నారు. ముదిరాజులకు దురదృష్టవశాత్తు టికెట్లు ఇవ్వలేకపోయామని.. అయినా వారిని నామినేటెడ్‌ పోస్టులతో కడుపులో పెట్టుకుని చూస్తామని మంత్రి కేటీఆర్‌ అంటున్నారని.. కానీ నామినేటెడ్‌ పోస్టులు సప్పగా ఉంటాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

బిత్తిరి సత్తి వ్యాఖ్యలు వైరల్‌ 

ముదిరాజులం 60 లక్షల జనాభా ఉన్నామని.. 115 సీట్లలో ఒక్కటి కూడా ముదిరాజులకు ఇవ్వలేదెందుకు అంటూ ప్రశ్నించారు. ముదిరాజులకు చేసిందేమి లేదని మండిపడ్డారు. అయితే.. బిత్తిరి సత్తి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.ఈ క్రమంలోనే.. బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానం ముదిరాజ్‌ వర్గంలో ఏర్పడిన అసంతృప్తిని పొగొట్టేందుకు.. పెద్ద స్కెచ్చే వేసింది. ఈ మేరకు.. బిత్తిరి సత్తితో కేటీఆర్‌ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ సారాంశం ఏంటీ అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిత్తిరి సత్తి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారా.. అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. గత కొంత కాలంగా.. రాజకీయాలపై బిత్తిరి సత్తి ఆసక్తి చూపుతుండడంతో ఆయనను బీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి పెద్దపీట వేస్తే.. ముదిరాజ్‌ల ఓట్లు కూడా కాపాడుకున్నట్టు అవుతుందన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో బిత్తిరి సత్తితో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పాట పాడిరచగా.. ఈసారి ఎన్నికల్లోనూ మరో పాట పాడిరచుకుంటారా.. లేదా పార్టీలో చేరమని ఆహ్వానించేందుకే ప్రగతి భవన్‌కు పిలిచారా అన్నది తెలియాల్సి ఉంది.

కారెక్కనున్న కాసాని ?

మరోవైపు  తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌.. సైకిల్‌ దిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు జోరందుకున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే ఆయన పసుపు కండువాకు నీళ్లొదిలి.. సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇదే జరిగితే కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే.. టీడీపీకి తెలంగాణలో మనుగడే కష్టమవుతున్న రోజుల్లో కాసాని అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి నడిపిస్తున్నారు. కాగా.. ఇప్పుడు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో టీటీడీపీ బరిలో దిగుతుందని.. అందుకు 89 మంది అభ్యర్థులు కూడా రెడీగా ఉన్నారని పలు సందర్భాల్లో కాసాని చెప్పుకొచ్చారు. అయితే.. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడు జైలులో ఉండటంతో ఆయన నుంచి ఎన్నికల విషయమై ఎలాంటి సంకేతాలు రాలేదు. చంద్రాబాబు నుంచి ఆదేశాలు రాగానే.. అభ్యర్థుల లిస్టుతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేసి ప్రచారంలోకి దిగాలని కాసాని రంగం సిద్ధం చేసుకుంటుంటే.. మరోవైపు తెలంగాణలో టీడీపీ పోటీ చేయటం లేదని నారా లోకేష్‌ పేరుతో ఓ లెటర్‌ విడుదల కావటం చర్చనీయాశంగా మారింది. దీంతో.. తీవ్ర అసంతృప్తికి లోనైన కాసాని.. పార్టీని వదలాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. కాగా.. కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన నేత కావటంతో.. బీఆర్‌ఎస్‌ కూడా భారీ స్కెచ్‌ వేసినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ముదిరాజులకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్క టికెట్‌ కూడా కేటాయించకపోవటంతో.. ఆ వర్గం నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో.. కాసానిని కారెక్కించుకుని పార్టీలో సముచిత స్థానం కల్పిస్తే.. ఆ వర్గం నుంచి వచ్చే వ్యతిరేకతను కొంతవరకైనా తగ్గించుకోవచ్చు.. అదే సమయంలో తెలుగు తమ్ముళ్ల ఓట్లు కూడా కారుకే పడే అవకాశముంటుందని బీఆర్‌ఎస్‌ పెద్ద స్కెచ్‌ వేసిందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే..!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !