.
భాగ్యనగరంలో సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, ఆ ఇల్లు కొనడమెలా అనేదే చాలామందికి సందేహం ఉంటుంది. మనం కొంటున్న ఇల్లు లేదా స్థలం గతంలో ఎవరైనా కొన్నారా.. ఎన్ని చేతులు మారింది అనేది తెలుసుకోడానికి ఈసీ(ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్) తీసుకుంటే పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఈసీ కావాలంటే..? 30 ఏళ్ల లోపు లావాదేవీలకు రూ.500లు, 30 ఏళ్లకు ముందు లావాదేవీల వివరాలు కావాలనుకుంటే రూ.1000లు చెల్లిస్తే సరిపోతుంది. టీ యాప్ ఫోలియోలోకి వెళ్లి ఆన్‌లైన్లో చెల్లించవచ్చు.. లేదంటే నేరుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు వెళ్లి కట్టినా సరిపోతుంది.
ఈసీతో మొదలు..
ఆస్తిని కొన్నప్పుడు లేదా విక్రయించే సమయంలో తప్పనిసరిగా ఈసీ అవసరం ఏర్పడుతుంది. దీనిని సబ్ - రిజిస్ట్రార్ కార్యాలయం జారీ చేస్తుంది. యజమాని పేరు, యాజమాన్యం బదిలీ, ఆస్తిపై తనఖాలు, ఏదైనా ఉంటే దానికి సంబంధించి వివరాలు అన్నీ ఈసీలో ఉంటాయి. మీసేవా కార్యాలయానికి వెళ్లినా.. లేదా ఐజీఆర్‌ఎస్ పోర్టల్‌ను సందర్శించినా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్లో ఈసీ పొందవచ్చు. మనకు పూర్తి వివరాలు తెలిస్తే సేల్‌డీడ్‌పై ఉన్న డాక్యుమెంట్ నంబరుతో సులభంగా తెలుసుకోవచ్చు. డాక్యుమెంట్ నంబరు లేనప్పుడు స్థిరాస్తి వివరాలు.. అంటే సర్వే నంబరు, నాలుగువైపులా సరిహద్దులు, ప్లాట్ లేదా ఫ్లాట్ నంబరు, అపార్టుమెంటు పేరు, ఇంటి నంబరు ఇలా వివరాలు పొందుపరిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. అలాగే సెర్చ్ ఈసీ అని సర్వే నంబరు, ఊరు, మండలం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వివరాలు పొందు పరిచినా పూర్తి సమాచారంతో ఈసీని పొందవచ్చు.
అగ్రిమెంట్.. సేల్‌డీడ్
మీరు కొనబోతున్న స్థిరాస్తి ఇల్లు, ఫ్లాట్, ప్లాట్ ఇలా ఏదైనా కావచ్చు.. కొనాలనుకున్న ఆస్తి ఎంత విలువ ఉంటుంది నిర్ధారించుకున్నాకా.. ఇరువురి మధ్య ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. అది స్టాంపు పేపర్‌పై చేసుకుని రిజిస్ట్రేషన్ చేయవచ్చు. ఈ అగ్రిమెంట్ ప్రకారం బ్యాంకులో రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు నుంచి రుణం మంజూరయ్యాక.. సేల్‌డీడ్ రాసుకోవాల్సి ఉంటుంది. సేల్‌డీడ్ ఎంతకు రాసుకున్నామో.. ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయించిన శాతం మేరకు స్టాంపు డ్యూటీ చెల్లించాలి. సేల్‌డీడ్ ప్రకారమే ఈ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అక్కడ స్థిరాస్తి విలువ ఆధారంగా లేదా.. మీరు చెల్లించిన మొత్తం ఏది ఎక్కువైతే దానికి స్టాంపు డ్యూటీ చెల్లించాలి. ప్రస్తుతం 5.5 శాతం స్టాంపు డ్యూటీ, 1.5 శాతం ఆస్తి బదలాయింపు పన్ను, 0.5శాతం రిజిస్ట్రేషన్ ఫీజు, 0.1 శాతం మ్యుటేషన్ (స్థిరాస్తి అమ్మిన వ్యక్తి పేరు నుంచి కొన్నవ్యక్తి పేరు చేర్చడం) ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 7.6 శాతం అవుతుంది.