CBN Health : చంద్రబాబుకు ఆరోగ్యంపై కీలక నివేదిక

0

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కీలక నివేదికను రిలీజ్‌ చేశారు. గత మూడ్రోజులుగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? ఆయన మెడికల్‌ రిపోర్టుల్లో ఏం తేలింది..? అనే కీలక విషయాలను నివేదికలో వైద్యులు నిశితంగా వివరించారు. బాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల మెడికల్‌ రిపోర్టులో తేల్చారు. అయితే.. మెడికల్‌ రిపోర్టును బటయపెట్టకుండా ఇప్పటి వరకూ చంద్రబాబుకు అంతా బాగుందంటూ జైలు అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే.. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చారు.

స్కిన్‌ అలర్జీ, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు !

చంద్రబాబు చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దర్లు, స్కిన్‌ అలెర్జీ ఉన్నట్టు వైద్యులు నిర్దారించారు. తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డిహైడ్రేషన్‌తో బాబు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ వైద్యులు తేల్చారు. డిహైడ్రేషన్‌తో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని నివేదికలో స్పష్టంగా వైద్యులు సూచించారు. చంద్రబాబుకు హైపర్‌ ట్రోఫీక్‌ కార్డియో మైయోపతి సమస్య ఉందంటున్న వ్యక్తిగత వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్‌తో గుండె పైనా ప్రభావం పడే అవకాశం ఉందని వ్యక్తిగత వైద్యుల ఆందోళన చెందుతున్నారు. అయితే.. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు చిన్నవేనని ప్రభుత్వం, అధికారులు చెబుతుండటం గమనార్హం. అయితే.. తాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తీవ్ర భావోద్వేగం..!

చంద్రబాబుతో నారా లోకేష్‌, నారా భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఈ రోజు ములాఖత్‌ అయ్యారు. బాబును చూసి భువనేశ్వరి, లోకేష్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ములాఖత్‌ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే నారా లోకేష్‌, భువనేశ్వరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మానసికంగా చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఉన్నా.. ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్‌-06 తేదీ నుంచి ములాఖత్‌లో ఆరోగ్యంగా కనిపించిన చంద్రబాబు.. ఇవాళ చాలా వీక్‌గా కనిపించడంపై కుటుంబ సభ్యులు బాధ పడుతున్నారు. గత ములాఖత్‌ నాటికి, నేటికి చంద్రబాబులో చాలా మార్పు వచ్చినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ములాఖత్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే భువనేశ్వరి, లోకేశ్‌ దుఃఖంతో నేరుగా బస కేంద్రానికి వెళ్లిపోయారు. జైలులో చంద్రబాబును చూసి చాలా బాధేసిందని కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు.

డీఐజీ రవికిరణ్‌తో లోకేశ్‌ వాగ్వాదం..

ములాఖత్‌ సమయంలో అక్కడే ఉన్న జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్‌ను..చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై లోకేశ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికను చూపించి.. తన తండ్రి అనారోగ్యంపై డీఐజీని నిలదీశారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు స్పష్టంగా నివేదిక ఉన్నప్పటికీ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎందుకు ప్రకటనలు ఇస్తున్నారని నిలదీశారు. చంద్రబాబుకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు వైద్యులు సూచన చేసి 48 గంటలు దాటినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. డీహైడ్రేషన్‌ బారిన పడిన చంద్రబాబును చల్లని వాతావరణంలో పెట్టాలన్న వైద్యుల సూచనలు ఎందుకు అమలు చేయలేదు? వైద్యుల సూచనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందా? లేదా?’’ అని ప్రశ్నించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దాచిపెట్టడం, వైద్యుల నివేదిక తొక్కిపెట్టడంపై లోకేశ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోకేశ్‌ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా ములాఖత్‌ సమయం అయిపోయింది.. వెంటనే వెళ్లాలని డీఐజీ రవికిరణ్‌ దురుసుగా వ్యవహరించినట్టు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !