చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం (అక్టోబర్ 9న) దీనిపై విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అంతకుముందు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై వాడీవేడి వాదనలు జరిగాయి. బాబు క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా.. 17ఏ చుట్టూ వాదనలు కొనసాగాయి. 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు లాయర్లు వాదించగా.. వర్తించదని సీఐడీ తరపున లాయర్లు వాదించారు. కీలక వాదనల అనంతరం ధర్మాసనం క్వాష్ పిటీషన్‌పై తీర్పును వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు అభిషేక్ సింఘ్వి, హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా.. సీఐడీ తరపున ముకల్ రోహత్గీ.. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ముందు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను ప్రస్తావిస్తూ వాదనలు కొనసాగాయి.చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని.. మెరిట్స్ జోలికి వెళ్లడం లేదని చంద్రబాబు తరపున లాయర్లు వాదించారు. సెక్షన్ 17ఏ ఉద్దేశం కక్షసాధింపు నుంచి రక్షణ అని.. పార్లమెంట్ నేతలకు ఇచ్చిన రక్షణను తుంగలో తొక్కారని పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీస్కోవాలని.. అన్ని కేసుల్లో సెక్షన్ 17ఏ రక్షణ కల్పిస్తుందని వివరించారు.
వాడివేడిగా వాదప్రతివాదాలు !
దీనికి సీఐడీ తరపున లాయర్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుకు 17ఏ వర్తించదని.. క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని పేర్కొన్నారు. 2018లో సెక్షన్ 17ఏ అమల్లోకి వచ్చిందని.. వందల కోట్ల దుర్వినియోగం జరిగిందని వివరించారు. ఈ కేసుకి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఏడాది జాప్యం తర్వాత కేసు నమోదైందంటూ వివరించారు. ఎఫ్.ఐ.ఆర్.లో పేరు, గవర్నర్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేశారని సాల్వే వాదించగా.. అన్ని ఆధారాలున్నాయని, అన్ని ప్రక్రియలు పాటించామని రోహత్గీ వివరించారు. 900 పేజీల డాక్యుమెంట్‌ను కోర్టులో దాఖలు చేశారని.. పథకం ప్రకారమే స్కిల్ డెవెలప్‌మెంట్ స్కామ్ జరిగిందని సీఐడీ లాయర్ వాదించారు. విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఈ పిటిషన్‌పై విచారణ జరపకూడదంటూ పేర్కొన్నారు. స్కిల్ సెంటర్లు పెట్టకుండానే నిధులు విడుదల చేశారు... 6 షెల్ కంపెనీలకు డబ్బులు తరలించారనీ సీఐడీ తరపున లాయర్ పేర్కొన్నారు. ప్రతీకారానికి దిగితే ఎప్పుడో అరెస్ట్ చేసేవారని.. ఆధారాలు ఉన్నాయి కాబట్టే చర్యలు తీసుకున్నారంటూ వివరించారు. కాగా.. ఇరు వైపులా వాదనల అనంతరం ధర్మాసనం.. హైకోర్టు ముందున్న డాక్యుమెంట్ల కంపైలేషన్ తమకు అందజేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది రోహత్గీకి ఆదేశించింది. సుప్రీంకోర్టుకు వెళ్లకు ముందుకు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. సీఐడీ వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవిస్తూ..క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అప్పుడు అసలు చంద్రబాబు తరఫున, సీఐడీ తరఫున కూడా వాడీవేడీ వాదనలు జరిగాయి.