సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ ఓ తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఉద్యమమే ఊపిరిగా బ్రతికారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం సుదీర్ఘంగా పోరాటం కొనసాగించారు. కల్లకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో గెలుపోటములను దాటుకుంటూ వజ్రసంకల్పంతో అంచలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ యువజన్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్).. ఆ తర్వాత.. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఆ ఏడాదిలోనే మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో 16వ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగానూ గెలిచారాయన. అయితే ఆ తర్వాత లోక్‌సభ పదవికి రాజీనామా చేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) పార్టీకి అధ్యక్షుడిగా, నాయకుడిగా కొనసాగుతోన్న సీఎం కేసీఆర్.. 2018 సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసి.. ఆపై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ముందుస్తు ఎన్నికల్లో విజయం సాధించి.. రెండోసారి తెలంగాణ రాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సీఎం పీటంపై కేసీఆర్ కన్నేశారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా.. సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటించి.. తన రాజకీయ చాణక్యతను రంగరించి ఎన్నికల ప్రచార వ్యూహాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో కూడా గులాబీ దళపతి ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేశారు. ఇక ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. అందులో ఒకటి ప్రస్తుత గజ్వేల్ నియోజకవర్గం కాగా, ఇంకొటి కామారెడ్డి నియోజకవర్గం.సీఎం కేసీఆర్ రాజకీయ జీవితం..
రాజకీయ ప్రస్థానం...
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఏ లిటరేచర్‌లో డిగ్రీ అందుకున్న తర్వాత.. 1980లో ఆంధ్రప్రదేశ్ యువజన్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ అరంగేట్రం చేశారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత రెండేళ్లకే సిద్ధిపేటలోని రాఘవపూర్ యువజన కాంగ్రెస్ స్థానిక ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అనంతరం 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి.. 1985లో తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1987-88 మధ్యలో రాష్ట్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 1988-89 మధ్యలో కరువు నియంత్రణ మంత్రిత్వశాఖ మంత్రిగా సేవలు అందించారు. ఇక 1989లో మళ్లీ సిద్ధిపేట నియోజకవర్గం నుంచే తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1989 నుంచి 1993 వరకు టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 1993లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, 1994లో మళ్లీ సిద్ధిపేట నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు సీఎం కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయంలో 1997 నుంచి 2000 దాకా రవాణ శాఖ మంత్రిగా పని చేసిన ఆయన.. 1999లో అసెంబ్లీకి ఎన్నికై, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రెండేళ్లు పని చేశారు. అనంతరం 2001లో తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి(ప్రస్తుతం బీఆర్‌ఎస్) పార్టీని స్థాపించారు. అంతేకాదు 2004లో క్యాబినెట్ హోదాలోనూ కార్మిక మంత్రిగా పని చేశారు కేసీఆర్.