పాలమ్మిన, పూలమ్మిన.. కష్టపడ్డ. వ్యాపారం చేసిన.. లబ్బర్ చెప్పులు వేసుకున్న.. మెడికల్ కాలేజీలు పెట్టిన.. ఇంజినీరింగ్ కాలేజీలు పెట్టినా, పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న, పేద పిల్లలకు స్కారల్‌షిప్‌పై చదువు చెబుతున్న’’ మోడల్ అయినా... ఫేమస్ అయినా... మల్లారెడ్డి అంటే ‘‘లో ప్రొఫైల్.. హై థికింగ్’’ ఇలా మాటల ప్రవాహం కొనసాగించే మంత్రి మల్లారెడ్డి అంటే తెలంగాణ ప్రజలకే కాదు.. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ జనాలకు కూడా పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన ఎలా పైకొచ్చాడని ఏ ఒక్కరిని అడిగినా.. తడుముకోకుండా గడగడా చెప్పేస్తుంటారు. ఆయనే కాదు.. ఆయన జీవిత ప్రమాణం కూడా అంత ఫేమస్ మరి. అలాంటిది.. మల్లారెడ్డి మీద కీలక ఆరోపణలు చేశారు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. మల్లారెడ్డి పాలమ్మో.. పూలమ్మో.. పైకి రాలేదని.. దివంగత జయలలిత ఆస్తులు కొట్టేసి ఇంతవాడయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జయలలిత డబ్బు, నగలు కొట్టేశాడు
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో.. ఏర్పాటు చేసిన సమావేశంలో సుధీర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ సీఎం జయలలితకు హైదరాబాద్ నగర శివార్లలోని కొంపల్లిలో 11 ఎకరాల స్థలం ఉండేదని.. అందులో ఆమె డెయిరీ ఫాం ఏర్పాటు చేశారని.. ఆ సమయంలో పాలవ్యాపారం చేసేందుకు మల్లారెడ్డి అక్కడికి వెళ్లేవాడన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఓసారి ఐటీ దాడులు జరగనున్నట్లు జయలలితకు సమాచారం రావటంతో తన దగ్గరున్న డబ్బు, నగలన్నింటినీ ఓ దగ్గర దాచిపెట్టగా.. వాటిని మల్లారెడ్డి కొట్టేశాడని సుధీర్ రెడ్డి తెలిపారు. అంతే కాకుండా.. మల్లారెడ్డి తన ఇంటి పక్కనుండే క్రిస్టియన్ విద్యా సంస్థల యజమానురాలికి మాయ మాటలు చెప్పి.. ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండా సంతకాలు పెట్టించుకుని.. ఆమె చనిపోయాక ఆస్తి మొత్తం కొట్టేశాడంటూ కీలక ఆరోపణలు చేశారు సుధీర్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డి ఇప్పుడు నీతులు చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మైసమ్మగూడలో చెరువు శిఖం భూములను కబ్జా చేసి అందులో కాలేజీలు కట్టారని ఆరోపించారు. ఆ కారణంగానే.. మొన్న కురిసిన భారీ వర్షాల కారణంగా విద్యార్థులు వరదల్లో చిక్కుకుపోవాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు.