BRS Top -3 Leaders : కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌లను టార్గెట్‌ చేసిన కాంగ్రెస్‌ ?

0

తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతోంది. మూడు ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. బీఆర్‌ఎస్‌ తరఫున కేసీఆర్‌ రంగంలోకి దిగగా.. కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు, పార్టీ అగ్రనేతలు తెలంగాణను చుట్టేస్తున్నారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని బీఆర్‌ఎస్‌ భావిస్తుండగా.. ఈసారి ఎలాగైనా కేసీఆర్‌ను గద్దె దించాలని కాంగ్రెస్‌ పట్టుదలతో ఉంది. ప్రజల్లో అభిమానం వెల్లువెత్తితే చాలు...మహామహులే మట్టి కరిచిన సందర్భాలు ఎన్నో. కాకపోతే కాలం కలిసిరావాలంతే... వ్యూహం సక్సెస్‌ కావాలి అంతే. గతంతో పోలిస్తే దూకుడుగా కనిపిస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ.. బీఆర్‌ఎస్‌ను ఓడిరచడం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. హస్తం నాయకత్వం గెలుపు వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా బీఆర్‌ఎస్‌ పార్టీని దెబ్బతీయడం కోసం అధికార పక్షంలోని టాప్‌-3 నేతలను కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావులకు వారి సొంత నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వడం కోసం ఆయా స్థానాల్లో తమ పార్టీకి చెందిన అగ్ర నేతలను కాంగ్రెస్‌ బరిలోకి దింపే దిశగా ఆలోచనలు చేస్తోందని సమాచారం. కేసీఆర్‌ గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే గజ్వేల్‌లో నర్సారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. కామారెడ్డిలో గులాబీ బాస్‌కు ప్రత్యర్థిగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తోంది. సిద్ధిపేటలో హరీశ్‌ రావుకు పోటీగా నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని.. సిరిసిల్లలో కేటీఆర్‌కు ప్రత్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రంగంలోకి దింపే యోచనలో హస్తం పార్టీ ఉందట.కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈ ముగ్గురు ఎంపీలు తమ తమ స్థానాల నుంచి పోటీ చేయడంతోపాటు బీఆర్‌ఎస్‌ అగ్రనేతల స్థానాల్లోనూ పోటీ చేయనున్నారని తెలుస్తోంది. 

ఢీ కొట్టడం అంత తేలికేం కాదు

అయితే ఈ ముగ్గురు నేతలకు గతంలో చేదు అనుభవాలు ఉండటం గమనార్హం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీ చేసిన రేవంత్‌ రెడ్డి ఓడిపోయారు. నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఓటమిపాలయ్యారు. మరోవైపు ఉత్తమ్‌ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. తర్వాత ఎంపీగానూ గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉత్తమ్‌ స్థానంలో హుజూర్‌నగర్‌ నుంచి ఆయన భార్య పద్మావతి పోటీ చేయగా.. ఓటమి ఎదురైంది. ఈ ముగ్గురు నేతలకు గతంలో ఉన్న చేదు అనుభవాలు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ టాప్‌-3 నేతలపై ఎదురుదాడికి దిగుతుండటం గమనార్హం. వాస్తవానికి కామారెడ్డి టికెట్‌ను సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ ఆశిస్తున్నారు. మరో వైపు గజ్వేల్‌లో కేసీఆర్‌పై ఏకంగా ఈటల రాజేందర్‌ పోటీ చేయనుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌ స్టాటజీలోనే బీజేపీ సైతం టాప్‌ `3 నాయకులను టార్గెట్‌ చేసినట్లతే...ఒకటి రెండు చోట్ల వ్యూహం ఫలించే అవకాశం ఉండోచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్‌, హరీశ్‌ రావు, కేటీఆర్‌లను వారి సొంత నియోజకవర్గాల్లో ఎదుర్కోవడం అంత తేలికేం కాదు. హరీశ్‌ రావు గత ఎన్నికల్లో లక్షకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. కేటీఆర్‌ సిరిసిల్లలో 89 వేల మెజార్టీతో గెలిచారు. ఇక కేసీఆర్‌ తమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటం పట్ల కామారెడ్డి వాసుల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో వారిపై తమ పార్టీకి చెందిన రెడ్డి సామాజికవర్గ నేతలను కాంగ్రెస్‌ బరిలోకి దింపితే పోరు ఆసక్తికరంగా మారనుంది. ఈ ముగ్గురు నేతలను సాధ్యమైనంత వరకు వారి సొంత నియోజకవర్గాలకు పరిమితం చేయాలనేది కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. అంతే కాదు బీఆర్‌ఎస్‌ టాప్‌-3 నేతలపై తమ అగ్ర నేతలను పోటీకి దింపడం ద్వారా ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకోవచ్చని హస్తం పార్టీ భావిస్తుండొచ్చు. కానీ ఈ వ్యూహం బెడిసికొడితే ఆయా నేతలు సొంత నియోజకవర్గాల్లో ఇబ్బంది పడాల్సి రావొచ్చు. మరి కాంగ్రెస్‌ నిజంగానే ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !