తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు.. ఇప్పుడు రెండో దశ ప్రచారం మొదలు పెట్టారు. ఇవాళ సూర్యాపేటలో బీజేపీ ‘జనగర్జన సభ’ నిర్వహించింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ సభకు హాజరయ్యారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుటుంబ పార్టీలని విమర్శించారు. కుటుంబ సంక్షేమం కోసమే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు పనిచేస్తాయి ఎద్దేవా చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపించాలని అమిత్ షా కోరారు.
గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి !
తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. బీజేపీ మాట ఇస్తే తప్పదన్నారు. సూర్యపేట బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. బీజేపీ పేదల పార్టీ అని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ కుటుంబ పార్టీలని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. కొడుకును సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యమని అమిత్ షా అన్నారు. కేసీఆర్‌కు బీసీల సంక్షేమం పట్టదన్నారు. రాహుల్ ను పీఎం చేయడం సోనియాగాంధీ లక్ష్యమని చెప్పారు. కేసీఆర్ బీసీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు అమిత్ షా. సమగ్రమైన అభివృద్ధి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నారు. వరంగల్‌లో సమ్మక్క సారక్క ట్రైబల్ వర్శీటీ ఏర్పాటు చేసిన మోడీకే దక్కుతుందన్నారు. పసుపు రైతులకు కోసం బోర్టు ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా నీళ్లలో తెలంగాణ హక్కుల కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామన్నారు. బీఆర్‌ఎస్ పేదల వ్యతిరేక పార్టీ..బీసీల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమీ హామీ ఏమైందని కేసీఆర్ ను ప్రశ్నించారు. దళితుల సంక్షేమం కోసం 50 వేల కోట్లతో ప్రత్యేక కార్యక్రమం ఎటు పోయిందన్నారు. తెలంగాణలోని 40 లక్షల రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 9 వేల కోట్లిస్తున్నామన్నారు. జలజీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రజలకు పెద్ద ఎత్తును నిధులు ఇస్తున్నామన్నారు.
అయితే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటల రాజేందరే ?
ఒకవేళ తెలంగాణలో బీజేపీ గెలిస్తే ఈటల రాజేందర్ కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో ఏకంగా కేసీఆర్‌ని ఢీకొట్టబోతున్నారు. అమిత్ షా హామీ తెలంగాణ ప్రజల్లోకి వెళితే..బీసీలు అంతా ఏకమైతే ముక్కోణపు పోటీ తప్పదని సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా తన శక్తి మేర ప్రజల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. జనాభాలో 57 % ఉన్న బీసీలు ఎటువైపు మెగ్గితే అటువైపే అధికారం, చూడాలి తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుందో.