TDP- Janasena: లోకేష్‌, పవన్‌కళ్యాణ్‌ భేటీ ! 6 అంశాల్లో క్లారిటీ !

0

రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌.. తెలుగుదేశం-జనసేన పొత్తు మొగ్గ తొడిగింది ఇక్కడే. చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యాక పొత్తు ప్రకటన చేసి.. ఏపీ పాలిటిక్స్‌ని హీటెక్కించారు పవన్‌. మళ్లీ ఇదే లొకేషన్‌.. రెండు పార్టీల ఉమ్మడి ప్రయాణంలో తొలి అడుగు పడిరది. రాజమండ్రి జైలుకు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో సమన్వయ కమిటీలతో కలిసి భేటీ అయ్యారు లోకేష్‌, పవన్‌కల్యాణ్‌. వారాహి, భవిష్యత్‌కి గ్యారెంటీ, నిజం గెలవాలి యాత్రలపై చర్చించారు. సీట్ల పంపకాలు మినహా మిగతా అన్ని అంశాలపై ప్రాధమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఇరుపార్టీలకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల సందర్భంగా భవిష్యత్‌ కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలపై కలిసి ముందుకు సాగే అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రతి కార్యక్రమానికి రెండు పార్టీల కేడర్‌ హాజరయ్యేలా వ్యూహం నిర్మించుకున్నారట.ఉమ్మడిగా జిల్లా, పార్లమెంట్‌, అసెంబ్లీ, మండల స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది. పొత్తులో ఎక్కడైనా ఇబ్బందులున్నా పరిష్కరించేలా కమిటీలకు బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించింది. నియోజకవర్గాల్లో రెండు పార్టీల ఇన్‌చార్జ్‌లు.. సమన్వయంతో, సర్దుబాట్లతో పనిచేసేలా నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీ చీడను వదిలించుకుందాం ! 

జగన్‌ పీడను విడిపించుకుందాం !

ఈ భేటీ అనంతరం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మీడియాలో మాట్లాడారు.  మద్యనిషేధం చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్ముతోంది. ఏపీకి వైసీపీ అనే చీడ పట్టుకుందని.. దానికి టీడీపీ, జనసేన అనే వ్యాక్సిన్‌ మందు అని పవన్‌ స్పష్టం చేశారు. ఏపీకి అనుభవజ్ఞుడైన నేత కావాలనే 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని తెలిపారు. మరోసారి ఇప్పుడు ఏపీకి అనుభవం కలిగిన నేత కావాలన్నారు. ప్రస్తుతం ఏపీలో జగన్‌ పాలన భయంకరంగా ఉందని.. టీడీపీ అగ్రనేతలలో పాటు జనసేన నేతలను వేధించడమే జగన్‌ పనిగా పెట్టుకున్నారని పవన్‌ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక జగన్‌ గాలికి వదిలేశారని పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు. ఏపీ భవిష్యత్‌ కోసం చారిత్రాత్మక పొత్తుకు శ్రీకారం చుట్టామని వివరించారు. కక్షతో చంద్రబాబును వేధించి జైల్లో మగ్గేలా వైసీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఆయన్ను అక్రమంగా, అకారణంగా జైల్లో పెట్టారని.. సాంకేతిక అంశాల పేరుతో బెయిల్‌ రాకుండా చేస్తున్నారని పవన్‌ అన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు, చంద్రబాబుకు మద్దతు ఇచ్చేందుకే రాజమహేంద్రవరంలో టీడీపీ నేతలతో భేటీ అయ్యామన్నారు. వచ్చే ఎన్నికలకు ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలనే అంశంపై చర్చించామని తెలిపారు. టీడీపీ, జనసేన కలిసి ఎలాంటి అంశాల్లో ముందుకెళ్లాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు పవన్‌ కళ్యాణ్‌ వివరించారు. టీడీపీ, జనసేన మధ్య ఎట్టి పరిస్థితుల్లో గొడవలు రావన్నారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులు అని.. అప్పులు చేసి కాకుండా రాష్ట్రాన్ని తాము అభివృద్ధి చేసి చూపిస్తామని పవన్‌ స్పష్టం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే ఈ భేటీ: లోకేశ్‌

విజయదశమి రోజు తెలుగుదేశం-జనసేన సమావేశం కావడం రాష్ట్రానికి మేలు చేస్తుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘వైసీపీ పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నారు. బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. వైసీపీ నేతల వేధింపులతో ముస్లిం సోదరులు ఆత్మహత్య చేసుకున్నారు’’ అని లోకేశ్‌ అన్నారు. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని లోకేశ్‌ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పలురకాలుగా వేధిస్తున్నారని మండిపడ్డారు. ‘‘సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ చేతకానితనం కనిపిస్తోంది. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే రెండు పార్టీల నేతలం భేటీ అయ్యాం’’ అని లోకేశ్‌ అన్నారు.

నవంబర్‌ 1న ఉమ్మడి కార్యాచరణ

నవంబర్‌ 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని లోకేశ్‌ అన్నారు. ఓటరు జాబితాపై అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా పరిశీలిస్తామన్నారు. ‘‘వందరోజుల కార్యాచరణ ప్రకటించాం. నవంబర్‌ 1 నుంచి మ్యానిఫెస్టో ప్రకటించి ప్రచారం ప్రారంభిస్తాం. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తాం. ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశాం. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఒక తీర్మానం, అరాచక వైసీపీ పాలన ఉంచి ప్రజలను రక్షించాలని మరొకటి, రాష్ట్రాభివృద్ధి కోసమే కలిసి పోరాటం చేయాలని మూడో తీర్మానం చేశాం’’ అని లోకేశ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !