Pavan Kalyan : పవన్‌ సరికొత్త రాజకీయ వ్యూహం !

0

దాహం తీర్చేది గ్లాసు.. దూరాన్ని తగ్గించేది సైకిల్‌.. జనసేన-టీడీపీ పొత్తు తర్వాత వారాహి యాత్రలో జనసేనాని పవన్‌ వ్యాఖ్యలివి. ఎన్‌డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన.. ఏపీలో బీజేపీతో స్నేహాన్ని లైట్‌గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అధికారం చేపట్టాలనే సుదూర లక్ష్యాన్ని చేరుకోవడానికి సైకిల్‌-గ్లాసు కాంబినేషన్‌పై కొత్త స్లోగన్‌ ఎత్తుకున్నారు పవన్‌.. అయితే కమలం పార్టీ పక్కన పెట్టేయడమే ఇక్కడ ఆసక్తికర పరిణామం...అసలు పవన్‌ వైఖరేంటి ? బీజేపీతో భాయీ భాయీ బంధానికి ముగింపు పలకనున్నారా? అసలు ఏం జరుగుతోంది?

బీజేపీ వైఖరిపై ఏంటి తెలియక...

టీడీపీ, జనసేన పొత్తులో తాజాగా బీజేపీ ప్రస్తావన మరుగున పడుతున్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహి యాత్ర చేస్తున్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రసంగంలో ఎక్కడా బీజేపీని సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. తాను గెలవాలన్నా.. తన పార్టీ నేతలు ఎమ్మెల్యేలు అవ్వాలన్నా బీజేపీతో సాధ్యం కాదన్నట్లు మాట్లాడుతున్నారు పవన్‌.. సైకిల్‌తో కలిసి పోటీ చేస్తేనే తన లక్ష్యం నెరవేరుతుందని సూటిగా.. స్పష్టంగా చెప్పేస్తున్నారు పవన్‌. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత గత నెలలో రాజమండ్రిలో పసుపు పార్టీతో పొత్తుపై జనసేనాని పవన్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. బీజేపీ తమతో కలిసి రావాలని.. కలిసి వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. అప్పుడే కాదు గతంలో కూడా చాలా సార్లు పొత్తుల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి.. మూడు పార్టీల మధ్య పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చేవారు పవన్‌.. ఏపీ సీఎం జగన్‌ను ఓడిరచాలంటే ఓట్ల చీలికకు అవకాశం ఇవ్వకూడదనే భావనతో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయాలని సూచించేవారు. అవసరం అయితే టీడీపీ-బీజేపీ మధ్య దూరం తగ్గించే బాధ్యత తీసుకోడానికి రెడీ అయ్యారు.

అకస్మాత్తుగా పొత్తు ప్రకటన !

ఎన్నికలకు మరో ఆరు నెలలు ఉండటంతో ఏపీలో పొత్తులపై ఊగిసలాట కొనసాగింది. కానీ, అనూహ్యంగా చంద్రబాబు అరెస్టు తర్వాత ఆకస్మత్తుగా పొత్తు ప్రకటన చేశారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనాని.. బీజేపీ వ్యతిరేకిస్తున్న టీడీపీతో కలిసి పోటీపై ప్రకటన చేయడం రాజకీయంగా ఆసక్తిరేకెత్తించింది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించడానికి అవసరమైతే ప్రధాని మోడీతో మాట్లాడతానని పదే పదే ప్రకటించిన పవన్‌.. ఆ ప్రయత్నం చేశారో లేదో గాని.. ఇప్పుడు బీజేపీ ఊసెత్తకుండా ప్రకటనలు చేస్తుండటమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ-జనసేన పొత్తు.. భవిష్యత్‌ రాజకీయాలపై చాలా స్పష్టంగా మాట్లాడిన పవన్‌.. ఎక్కడా బీజేపీని ప్రస్తావించకపోవడం.. కేంద్రం సపోర్టు అవసరం అంటూనే.. బీజేపీతో కలిసి పోటీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీపై పవన్‌ వైఖరి మారిందా అనే అనుమానం రేకెత్తుతోంది. ఏపీలో ప్రధాన రాజకీయ శక్తులుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు పోరాడుతున్నాయి. పదేళ్లుగా జనసేన కూడా తన ఉనికిని చాటుకోడానికి ప్రయత్నిస్తోంది. 2014లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి సపోర్ట్‌ చేసిన జనసేన.. 2019లో మాత్రం టీడీపీకి మద్దతు ఇవ్వకుండా బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జనసేనకు ఆరు శాతం ఓట్లు వస్తే.. బీజేపీకి సున్నా పాయింట్‌ ఆరు శాతం ఓట్లు వచ్చాయి. జనసేన ఓ చోట గెలిస్తే.. బీజేపీకి చాలాచోట్ల డిపాజిట్‌ కూడా దక్కలేదు.

జనసేన బలోపేతమే లక్ష్యంగా...

వచ్చే ఎన్నికల్లో ఇవే పరిస్థితులు ఉండటంతో బీజేపీతోకన్నా.. టీడీపీతో కలిసి పోటీచేయడంపైనే ఫోకస్‌ పెట్టారు జనసేనాని. సైకిల్‌ సంక్షోభంలో ఉన్నప్పుడు, స్నేహహస్తం చాచి మద్దతు తెలిపారు. దీనితో జనసేనకు తెలుగుదేశం పార్టీ అనివార్యంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఏర్పడిరది. అంతే కాకుండా 30 నుండి 40 సీట్లలో గెలుపు బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీపైనే ఉంది. మరోవైపు రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవని సిఎం అభ్యర్థి అనే ముద్ర తొలగించుకోవడానికి పవన్‌ తాపత్రయపడుతున్నారు. తన పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి వచ్చిన చంద్రబాబు అరెస్ట్‌ అవకాశాలన్ని తనకు అనుకూలంగా జనసేనాని మలుచుకున్నారు. ముందుగా తనతో పాటు 30 నుండి 40 ఎమ్మేల్యే సీట్లు గెలుచుకుని 2029 కల్లా పూర్తి స్థాయి రాయకీయ పార్టీగా మారేందుకు తన ప్రణాళికను విస్తరించుకుంటున్నారు. బీజేపీ-జనసేన రెండు పార్టీల పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. సీఎం జగన్‌ పార్టీని ఓడిరచడం కూడా సాధ్యం కాదనేది జనసేనాని అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే ఏపీ రాజకీయాల వరకు టీడీపీతో స్నేహానికి ప్రాధాన్యం ఇచ్చారు పవన్‌.. ఇక టీడీపీ-జనసేన కూటమిలో చేరే విషయంపై బీజేపీతో ఎలాంటి చర్చలు జరిగాయో గాని.. ఆ ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశాలు కనిపించకపోవడంతో సైకిల్‌-గ్లాసు కాంబినేషన్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్‌.. ఇలా తన మనసులో మాటను బయటపెట్టడంతో ఇప్పుడు తేల్చుకోవాల్సింది బీజేపీయేనని పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !