మార్కాపురంలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన లెక్చరర్ దారి తప్పాడు. తన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న విద్యార్థినిపై కన్నేశాడు. ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పూలసుబ్బయ్య కాలనీకి చెందిన విద్యార్థిని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజ్‌లో యర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామానికి చెందిన గోవింద్ నాయక్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. లెక్చరర్‌కు వివాహం జరిగి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే మార్కాపురంకు చెందిన విద్యార్థినిపై కన్నేసిన గోవింద్.. ఇంటి వద్ద దించే నెపంతో విద్యార్థినిని ఓ రోజు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. పట్టణ శివారులోకి తీసుకెళ్లి అక్కడ ఆమె అసభ్యకర చిత్రాలను సెల్‌ఫోన్‌లో బంధించాడు. అనంతరం వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు.
వికృత చేష్టలు
ఈ క్రమంలో సదరు విద్యార్థిని ఇంటర్ రెండో ఏడాది ఆ కళాశాలలో కాకుండా మరో కాలేజీలో చదివేందుకు వెళ్లిపోయింది. అయినప్పటికీ గోవింద్ నాయక్ తన వికృత చేష్టలు మానలేదు. ఆమె అసభ్య చిత్రాలు తన వద్ద ఉన్నాయని.. ఇతరులకు చూపుతానని బెదిరింపులకు గురిచేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని గర్భం దాల్చింది. విషయం తెలిసిన నిందితుడు అబార్షన్ చేసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆమె అంగీకరించక పోవడంతో దాడికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఆమెను వైద్యులు పరీక్షించారు. కడుపుపై దెబ్బలు తగలడంతో విద్యార్థిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి తలెత్తిందని.. అబార్షన్ చేయాలని సూచించారు. చివరికి బాధితురాలు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రైవేట్ అధ్యాపకుడిపై అత్యాచారం, పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.