చంద్రబాబుకు జైల్లో సరైన వైద్యం అందటంలేదని..వైద్యం అందించటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటూ నారా భువనేశ్వరి ఆరోపించారు. చంద్రబాబు ప్రాణాలకు జైల్లో ముప్పు ఉందంటూ నారా బ్రాహ్మణి ఆరోపించారు. ఇలా చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది అంటూ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జైల్లో చంద్రబాబుకు ముప్పు ఉంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. జైల్లో చంద్రబాబుకు ఏసీ వంటి సౌకర్యాలు కల్పించటానికి అదేమన్నా అత్తారిల్లా..? అంటూ సెటైర్లు వేశారు. ఉక్కపోత జైల్లో ఉండే మిగతాఖైదీలకు ఉండదా..? అంటూ ప్రశ్నించారు. ఆయన బరువు తగ్గిపోయారని ప్రచారం చేస్తున్నారు..కానీ ఆయన బరువు ఏమీ తగ్గలేదు పైగా కిలో బరువు పెరిగారు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన కోసం ప్రత్యేకించి డాక్టర్లు 24గంటలు అందుబాటులో ఉన్నారని అన్నారు. చంద్రబాబు స్నానం చేయటానికి ప్రత్యేకించి ట్యాంకులు కట్టించాలా..? అంటూ ఎద్దేవా చేశారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అంటూ తప్పుడు ప్రచారాలు చేసి ఎలాగైనా బయటకు తీసుకొచ్చేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటూ సజ్జల విమర్శించారు. కాగా..చంద్రబాబు ఆరోగ్యం గురించి తమకు ఆందోళనగా ఉందని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై తమకు నమ్మకం కోల్పోయామని..చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.