తెలంగాణ ఇంటెలిజెన్స్ రిపోర్టులు సీఎం కేసీఆర్‌కు షాక్ ఇచ్చాయని తెలుస్తోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టుపై బీఆర్‌ఎస్ పార్టీ అధినాయకత్వం ప్రత్యేకించి కేసీఆర్, కేటీఆర్ సహా పలువురు కారు పార్టీ అగ్రనేతలు స్పందించిన తీరు ప్రజల్లోకి నెగెటివ్‌గా వెళ్లిందనేది ఆ రిపోర్టు సారాంశం. దీనివల్ల బీఆర్‌ఎస్ పార్టీకి నెగెటివ్ ఓట్స్ రెడీ అయ్యాయని ఇంటెలీజెన్స్ వర్గాలు గుర్తించాయి. తెలంగాణలో ఏపీవాసులు, ఓ సామాజిక వర్గంవారు అత్యధికంగా నివసించే చాలా నియోజకవర్గాల్లో కేసీఆర్ పార్టీ విజయంపై దీని నెగెటివ్ ఎఫెక్ట్ కనిపించే ఛాన్స్ ఉందని గ్రౌండ్ లెవల్ నుంచి ఇన్ఫర్మేషన్ అందిందట. ఈ నివేదికలను చూసి సీఎం కేసీఆర్ ఆందోళనకు గురయ్యారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ప్రతీ నియోజకవర్గంలో 10వేల నుంచి 40 వేలమంది..
చంద్రబాబు అరెస్టు వ్యవహారం రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 10వేల నుంచి 40 వేలమంది ఓటర్లపై ప్రభావం చూపిందని పేర్కొంటూ ఇంటెలీజెన్స్ రిపోర్ట్స్‌లో ఉండటాన్ని చూసి గులాబీ బాస్ షాక్ కు గురయ్యారట. టీడీపీ చీఫ్ అరెస్టుపై బీఆర్‌ఎస్ పార్టీ ఉదాసీనంగా వ్యవహరించడాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఇంటెలీజెన్స్ వర్గాలు క్షేత్రస్థాయిలో గుర్తించాయి. ఏదిఏమైనప్పటికీ గ్రౌండ్ లెవల్ లో ప్రస్తుత పరిస్థితులు బీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా మారాయని ఈ నివేదికలు కుండబద్దలు కొట్టేలా చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ నేతల తీరుపై పెరుగుతున్న ప్రజాగ్రహం ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఫలితాల రూపంలో బయటికి వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.
15 నియోజకవర్గాల్లో సెటిలర్స్ కీలకం..
ప్రత్యేకించి తెలంగాణలోని 42 నియోజకవర్గాల్లో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉందని, తమ మనోభావాలను బీఆర్‌ఎస్ గౌరవించడం లేదని సెటిలర్లు అనుకుంటున్నారని ఇంటెలీజెన్స్ వర్గాల పరిశీలనలో తేలింది. 35 నియోజకవర్గాల్లో 5 వేలకు పైగా సెటిలర్ల ఓట్లు ఉన్నాయి. అయితే 24 నియోజకవర్గాల్లో వారు గెలుపోటములు శాసించే స్థితిలో ఉన్నారని నివేదికలతో స్పష్టం అవుతోంది. వీటిలోనూ దాదాపు 15 నియోజకవర్గాల్లో సెటిలర్స్ ఎటువైపు మొగ్గు చూపితే.. అటువైపే విజయం సిద్ధించే పరిస్థితులు ఉన్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వారిని ప్రసన్నం చేసుకునే పార్టీలకే గెలుపు దక్కుతుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ నివేదక నేపథ్యంలో గులాబీ బాస్ ఏం చేస్తారు ? చంద్రబాబు అరెస్టు పై ఎలాంటి వైఖరిని తీసుకుంటారు ? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.