Medigadda Barriage issue : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ 20వ పిల్లర్ ఒక్కసారిగా కుంగిపోయింది. శనివారం సాయంత్రం భారీ శబ్దంతో బ్రిడ్జ్ కుంగింది. బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఒక అడుగు మేర బ్యారేజీ కుంగిపోయినట్లు అధికారులు గుర్తించారు. మేడిగడ్డ బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉంది. తాజాగా కుంగిన పిల్లర్ మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. వెంటనే అప్రమత్తమైన నీటిపారుదల శాఖ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేసింది.
కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటి బ్రిడ్జి
కాగా మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో 2019లో నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటి బ్రిడ్జి కావడం విశేషం. శనివారం రాత్రి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వచ్చింది. దీంతో 8 గేట్లు తెరిచి దిగువకు నీళ్లు వదులుతున్న క్రమంలో పెద్ద శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీర్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బ్రిడ్జ్‌ను వారు పరిశీలిస్తున్న సమయంలో కూడా మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేశారు. మేడిగడ్డ బ్యారేజీకి 16.17 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. ప్రస్తుతం అక్కడ 10.17 టీఎంసీల జలాలు ఉన్నాయి. శనివారం రాత్రి వంతెన కుంగిన నేపథ్యంలో ఇంజినీర్లు ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తొలుత 12 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. ఆ తర్వాత 46 గేట్లను తెరిచారు. దాదాపు 50 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. బ్యారేజీని ఖాళీ చేశాక దిగువన బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లిందా అనే విషయం పరిశీలించనున్నట్లు ఇంజినీర్లు చెబుతున్నారు.రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిపే వంతెన కుంగడంతో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానంతో మహారాష్ట్ర వైపు సిరోంచ, తెలంగాణ వైపు మహదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వంతెనను ఎల్‌అండ్‌టీ గుత్తేదారు సంస్థ నిర్మించింది. నిన్నటి ఘటనతో హుటాహుటీన ఆ సంస్థ నిపుణులు అర్ధరాత్రికి మేడిగడ్డ చేరుకున్నారు. అయితే చీకటిగా ఉండటంతో ఉదయం క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. గతేడాది 29 లక్షల క్యూసెక్కుల వరదను డ్యాం ఎదుర్కొందని దృఢంగా నిలబడిరది. అలాంటి ఇప్పుడెందుకు భారీ శబ్ధంతో వచ్చిందనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఎవైనా మరమ్మత్తులు ఉంటే చేస్తామని గుత్తేదారు సంస్థ తెల్పింది.
పరిశీలన - రాకపోకలు బంద్
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై రాకపోకలు సాగించే వంతెన గత రాత్రి వంతెన కుంగడంతో యుద్ధ ప్రాతిపదికన జలాశయం ఖాళీ చేసే పనులు చేపట్టారు. రాత్రి నుంచి క్రమంగా గేట్ల సంఖ్య పెంచుతూ.. నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో 2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. బ్యారేజీ గేట్లను మూసివేశారు. మేడిగడ్డ బ్యారేజీ పై వంతెన కుంగడంతో.. కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు ఇటు మహారాష్ట్రలోని సిరోంచ, భూపాలపల్లిలోని మహదేవ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం 6.20 నిమిషాల వద్ద భారీ శబ్దం వినిపించిందని.. వెంటనే ఘటనస్థలానికి చేరుకున్నట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్లాక్ నెంబర్ 7లోని19, 20, 21 పిల్లర్ల దెబ్బతిన్నాయని.. మహారాష్ట్ర వైపు ఉన్న పిల్లర్ 20 పైనున్న గోడలు దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసాంఫీుక శక్తుల ప్రమేయం ఉండచ్చని అనుమానిస్తున్నామని దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
నాణ్యతా లోపమే `- రేవంత్ రెడ్డి
మేడిగడ్డ లక్ష్మీ ప్రాజెక్టు కుంగడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. నాణ్యతలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని ఆరోపించారు.కేసీఆర్ గొప్ప ఇంజినీరుగా చెప్పుకుని రూ.లక్ష కోట్లు వృథా చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు జరిపించాలని తెలిపారు. కాళేశ్వరం పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు డిజైన్ రూపొందించాని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారని గుర్తుచేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ ఎన్నోసార్లు చెప్పారని రేవంత్ పెర్కొన్నారు.