తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండగా, ఒక వర్గం వారు మరోవర్గానికి టికెట్లు రాకుండా లాబియింగ్ చేస్తున్నారు. అంబర్‌పేట్ నియోజకవర్గం కేంద్రంగా ఏర్పడిన వార్.. గాంధీభవన్‌లో రెడ్డి వర్సెస్ బీసీ ఫైట్‌గా మారింది. ఇప్పటివరకూ తనదైన స్టైల్లో మాట్లాడిన వీ హనుమంతరావు ఇవాళ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ముందు అంబర్‌పేట్ టికెట్‌కి సంబంధించి ప్రపోజల్ పెట్టిన వీహెచ్.. దానికి అడ్డుపడుతున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్ హనుమంతరావు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తనను, జగ్గారెడ్డిని పార్టీ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. రేవంత్‌కి వ్యతిరేకంగా జగ్గారెడ్డితో మాట్లాడిరచింది ఉత్తమే.. అంటూ పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని జగ్గారెడ్డిని ఉత్తమ్ నమ్మించారని.. పార్టీ మారుతున్నట్లు బ్లాక్ మెయిల్ చేసి పదవులు తెచ్చుకున్నారంటూ వీహెచ్ మండిపడ్డారు. తనకు.. తన భార్యకు సీట్లు కావాలి, మాకొద్దా అంటూ వీహెచ్ ప్రశ్నించారు.లక్ష్మణ్ యాదవ్ కోసం అంబర్‌పేట్ సీటు కావాలని వీహెచ్ అడుగుతున్నారు.. అయితే.. తన మనుషుల కోసం అదే సీటును ఉత్తమ్ అడుగుతున్నారు.. దీంతో వారిద్దరి మధ్య వివాదం చినికిచినికి గాలివానలా మారింది.
ఉత్తమ్ కుటుంబానికి రెండు సీట్లు కావాలా ?
ఆదివారం మీడియాతో మాట్లాడిన వీహెచ్ హనుమంతరావు.. ఉత్తమ్‌కి బీసీల ఓట్లు కావాలి, సీట్లు మాత్రం ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. బీసీ టికెట్ల విషయంలో కోమటిరెడ్డి మాట తప్పారన్నారు. తనకు పోటీగా నూతి శ్రీకాంత్ గౌడ్ టిక్కెట్ కోసం ఉత్తమ్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. తనకు టిక్కెట్ రాకుండా చేస్తే ఉత్తమ్ బండారం బయటపెడతానని హెచ్చరించారు. సూర్యాపేటలో బీసీ మీటింగ్ పెడుతా అంటే పెట్టనీయలేదు. ఉత్తమ్ నా అంబర్ పేట్ సీట్ వెంట పడ్డారు. ఈ సీటు కోసం ఇక్కడ నూతి శ్రీకాంత్ గౌడ్‌ను ఎగదోస్తుండు. శ్రీకాంత్ గతంలో నాపై తప్పుడు కేసులు పెట్టించాడు. అలాంటి వ్యక్తిని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. అదే సమయంలో నాపై దుష్ప్రచారం చేస్తుండు. గత ఎన్నికల్లో డబ్బులు తీసుకొని వెనక్కి తగ్గానని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. నేను డబ్బులు తీసుకునే వ్యక్తిని కాదు. అంబర్‌పేట్ నియోజకవర్గం నుంచి గతంలో గెలిచి మంత్రిని అయ్యానని.. అంబర్ పేట్ అభివృద్ధి కోసం అనేక పనులు చేశానంటూ వివరించారు. ఇక్కడి నుంచి లక్ష్మణ్ యాదవ్ కు కాంగ్రెస్ టికెట్ కావాలని అడుగుతున్నా.. గతంలో ఇక్కడి నుంచి యాదవులు గెలిచారు. గత ఎన్నికల్లో కోదండరాం పట్టుబట్టడం.. అధిష్టానం కూడా చెప్పడంతో వెనక్కి తగ్గామంటూ పేర్కొన్నారు. ఇప్పుడు ఉత్తమ్ నా అంబర్ పేట్ సీట్ వెంట పడ్డారంటూ వీహెచ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ లో నుంచి బయటకు పంపేందుకు ఉత్తమ్ కుట్ర చేస్తున్నారని.. తాను పార్టీ మారనని.. గాంధీ కుటుంబానికి విరాభిమానిని.. అంటూ తెలిపారు. ఉత్తమ్ తన మనుషులు మహేశ్వర్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డిని పంపించారని.. జగ్గారెడ్డి ని కూడా పార్టీ నుంచి పంపే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. పార్టీ మారుతున్నా అని మీడియాలో ప్రచారం చేసుకొని.. బ్లాక్ మెయిల్ చేసి పదవులు తెచ్చుకున్నారంటూ పేర్కొన్నారు. ఉత్తమ్ పార్టీ వ్యతిరేకంగా చేసిన పనులను బయట పెడుతానని.. తాను పార్టీ లాయలిస్ట్ అంటూ పేర్కొన్నారు. బీసీలకు టిక్కెట్ల లెక్కపై ప్రశ్నించిన వీహెచ్.. ఉత్తమ్ వ్యవహారతీరుపై కంటతడిపెట్టడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది.అయితే, వీహెచ్ వ్యాఖ్యలపై ఉత్తమ్ ఇంకా స్పందించలేదు.