Purandeswari : విజయసాయి బెయిల్‌ రద్దు చేయండి

0

  • అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
  • సిజేఐకి పురంధరేశ్వరి లేఖ

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు. పదేళ్లుగా బెయిల్‌పై కొనసాగుతూ సీబీఐ, ఈడీ కేసుల విషయంలో విజయసాయి షరతులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఆయనపై ఇప్పటికే 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు లేఖతో పాటు ఐదు దస్త్రాలు, విజయసాయి కేసు వివరాలు, భూకుంభకోణాలపై ప్రత్యేక కథనాలను పురందేశ్వరి జతచేశారు.

పదే పదే వాయిదాలతో విచారణకు డుమ్మా

అధికారంలో ఉన్న సీఎం జగన్‌, ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 ఏళ్లకుపైగా బెయిల్‌పై కొనసాగుతున్నారని తన లేఖలో పురందేశ్వరి పేర్కొన్నారు. వీరు ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా ఆలస్యం చేస్తూ నిరోధిస్తున్నారని ఆరోపించారు. పదే పదే వాయిదాలతో విచారణకు రాకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. విజయసాయి తన బినామీలతో రాష్ట్రంలో కొన్ని డిస్టిలరీలను నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో బయటపడిరదని, ఈ అంశం వెలుగులోకి రాగానే మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంమంత్రికి లేఖలు రాసినట్లు తెలిపారు.

బెదిరింపులు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లోనే విశాఖలో చాలా మందిని విజయసాయి బెదిరించి వారి ఆస్తులను కబ్జా చేయించారని ఆరోపించారు. కుటుంబసభ్యుల కంపెనీల కోసం బెదిరించి భూములు కొన్నారన్నారు. వాస్తవానికి విశాఖ దసపల్లా భూముల విషయంలో బెదిరించి, అభివృద్ధి ప్రాతిపదికన భూ యజమానులకు నామమాత్రపు వాటాతో స్వాధీనం చేసుకోవడంలో కూడా ఆయన సూత్రధారిగా ఉన్నట్లు తెలిపారు. వీటిలో కొన్నింటిని తాను ప్రస్తావించినప్పుడు ఎంపీ విజయసాయి బహిరంగంగా విలేఖరుల సమావేశంలో తనను బెదిరించారని పురందేశ్వరి ఆరోపించారు. ఇలాంటి అంశాలపై భవిష్యత్తులో మాట్లాడితే, ప్రజల మధ్య బయట తిరగకుండా చేస్తానని వ్యక్తిగత దూషణలు చేశారన్నారు.

బెయిల్‌ రద్దు చేయాలి

మాజీ మంత్రి వివేకాను గొడ్డలితో నరికి హత్య చేసినవేళ..  ప్రెస్‌మీట్‌ పెట్టి అది కేవలం గుండెపోటు, సహజ మరణమని చెప్పిన మొదటి వ్యక్తి విజయసాయి అనే అంశం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇలాంటి వారి వల్ల మన వ్యవస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తన లేఖను పరిశీలించి ప్రస్తావించిన అంశాల్లో జోక్యం చేసుకొని విజయసాయి బెయిల్‌ను తక్షణమే రద్దు చేయాలన్నారు. వచ్చే 6 నెలల్లో ఈ కేసులన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సీజేఐకి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !