చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ లక్షల మందిని బలితీసుకుంది. ఈ మహమ్మారి మిగిల్చిన విషాదం నుంచి మానవాళి ఇంకా కోలుకోక ముందే చైనాలో మరో ప్రాణాంతక వైరస్ విజృంభిస్తున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. చైనాలో స్కూల్ స్టూడెంట్స్ న్యుమోనియా బారిన పడుతున్నారని.. ఈ వ్యాధి బారిన పడినవారు అంతుచిక్కని లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా ప్రోమెడ్ సంస్థ అప్రమత్తం చేసింది. పిల్లల్లో న్యూమోనియా లక్షణాలతో ఉన్న కొత్త వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అది న్యూమోనియా లక్షణాలతో ఉన్నా.. న్యూమోనియా కాదు అంటున్నారు డాక్టర్లు. దీంతో చైనా వైద్య శాఖ అత్యవసర ట్రీట్ మెంట్లకు ఏర్పాట్లు చేస్తుంది. బీజింగ్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో న్యుమోనియా వ్యాప్తి పెరగడంతో చైనీస్ ఆసుపత్రులు ‘‘బాధిత చిన్నారులతో నిండిపోయాయి’’. చిన్నారులు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. సైతం చైనా పిల్లల్లోని వ్యాధి లక్షణాలు, ట్రీట్ మెంట్ వివరాలు తక్షణమే వెల్లడిరచాలని చైనా దేశాన్ని ఆదేశించింది.మరోవైపు ఈ అంటువ్యాధి మరింత ప్రబలకుండా తాత్కాలికంగా స్కూల్స్‌కు సెలవులు ఇచ్చారు. అదే సమయంలో ఈ లక్షణాలు స్కూల్ టీచర్స్‌లో కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కలవరపాటు
ఈ వ్యాధి బారిన పడిన పిల్లలు అధిక జ్వరం, ఊపిరితిత్తుల్లో వాపు, దగ్గు.. లాంటి లక్షణాలను కలిగి ఉంటున్నారు. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుందని.. చిన్న పిల్లలకు వెంటనే ఎటాక్ అవుతుందని చైనానే చెబుతోంది. న్యూమోనియా తరహాలో ఉన్నా.. అందులో కొత్త వైరస్ లు ఉన్నట్లు అనుమానాలను సైతం చైనాలోని సైంటిస్టులు వ్యక్తం చేయటంతో.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం అప్రమత్తం అయ్యింది. పూర్తి వివరాలు ఇవ్వాలని చైనాను కోరుతుంది. చైనాలోని మిగతా ప్రాంతాలకు ఇది వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. అంతుచిక్కని న్యూమోనియా లక్షణాలతో ఉన్న ఈ వ్యాధిపై 2023, నవంబర్ 21వ తేదీన అలర్ట్ జారీ చేసింది చైనా సర్కార్. మిస్టీరియస్ న్యూమోనియా అంటూ ప్రకటించింది. ఇది ఎక్కడ మొదలైంది.. ఎలా మొదలైంది అనేది తెలియదు అంటూనే.. చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు స్పష్టం చేసింది చైనా. ఇది పెద్దలను సైతం ప్రభావం చేస్తుందని హెచ్చరిస్తుంది. మళ్లీ చైనాలో ఫేస్ మాస్కులు ధరించాల్సిన రోజులు వచ్చాయంటూ అమెరికాకు చెందిన హెల్త్ డిపార్ట్ మెంట్ సైతం వార్నింగ్ ఇవ్వటం విశేషం. ఈ కొత్త వైరస్ వ్యాప్తి ఈ రోజు మొదలైంది కాదని.. 2023, అక్టోబర్ నెలలో చైనా జాతీయ దినోత్సవ వేడుకల సమయంలో బయటపడిరదని డాక్టర్లు చెబుతున్నారు. మొదట న్యూమోనియాగా భావించినా.. ఆ వ్యాధి తీవ్రత దృష్ట్యా.. అది న్యూమోనియాలోని కొత్త రకం వైరస్ గా భావించినట్లు చెబుతోంది చైనా ఆరోగ్య శాఖ. అది క్రమంగా వేగంగా విస్తరించటం వల్ల ప్రపంచానికి తెలిసింది. ఈ వ్యాధి బారిన పడిన పిల్లల్లో 50 శాతం మంది ఇంట్లో ఉండే చికిత్స తీసుకుంటున్నారని.. జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు వంటివి ఎక్కువగా ఉంటేనే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెబుతోంది చైనా. ఇక్కడ ఓ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది చైనా సర్కార్. ఇప్పటి వరకు ఈ న్యూమోనియా లక్షణాలతో ఎవరూ చనిపోలేదని గట్టిగా చెబుతుంది. చైనా చెప్పేది ఎంత వరకు నిజం అనేది కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తుంది. అయితే చైనాలో కోవిడ్-19 నియంత్రణ కోసం విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో ఇన్‌ఫ్లుఎంజా, మైకోప్లాస్మా న్యుమోనియా (సాధారణంగా చిన్న పిల్లలను ప్రభావితం చేసే ఒక సాధారణ బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్), శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ వంటి అంటువ్యాధులు ప్రబలుతున్నాయని వ్యాధికారక వ్యాప్తికి చైనా అధికారులు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆస్పత్రుల వద్ద చిన్నారులు, తమ కుటుంబ సభ్యులతో క్యూ కట్టిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
పూర్తి వివరాలు కోరిన డబ్ల్యూహెచ్‌వో
ఉత్తర చైనాలో గత మూడు సంవత్సరాలలో ఇదే కాలంతో పోలిస్తే అక్టోబరు మధ్య నుండి ఇన్‌ఫ్లుఎంజా వంటి అంటువ్యాధులు పెరిగాయనివరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. అనారోగ్యం, వ్యాధి లక్షణాలు, చిన్నారులు ఉండే ప్రాంతాల పూర్తి సమాచారాన్ని ఇవ్వమని చైనా ప్రభుత్వాన్ని కోరింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదనపు సమాచారాన్ని కోరుతూ టీకాతో సహా శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి చైనాలోని ప్రజలు నివారణ చర్యలను అనుసరించాలని సిఫార్సు చేస్తోంది. వ్యాధి బారిన పడిన వ్యక్తులను దూరం ఉంచడం.. అవసరమైన పరీక్షలు నిర్వహించడం, వైద్య సంరక్షణ పొందడం, మాస్క్ లు ధరించడం , మంచి గాలి వెలుతురు వచ్చే ప్రాంతాల్లో నివసించడం, చేతులను తరచుగా శుభ్రపరచుకోవడం వంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.