KCR, KTR : బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతల నామినేషన్ల సందడి !

0

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం గజ్వేల్‌, మధ్యాహ్నం కామారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. గజ్వేల్‌లో సమీకృత భవనంలో రిటర్నింగ్‌ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందించిన ఆయన.. కామారెడ్డిలోని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ వేశారు. గజ్వేల్‌లో నామినేషన్‌ అనంతరం కేసీఆర్‌ ప్రచార వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు.  మరోవైపు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయంలో హరీశ్‌రావు, సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో కేటీఆర్‌ నామినేషన్లు వేశారు. నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. బీఆర్‌ఎస్‌ అగ్రనేతల నామినేషన్ల సందర్భంగా ఆయా చోట్ల సందడి వాతావరణం నెలకొంది.

కేటీఆర్‌కు తప్పిన ప్రమాదం

వందల మంది అభిమానులు, అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్‌ వేయాలని జీవన్‌ రెడ్డి భావించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు బాగా దగ్గర వ్యక్తి అనే విషయం తెలిసిందే. దీంతో ఈ నామినేషన్‌ ప్రక్రియకు కేటీఆర్‌ హాజరయ్యారు. ‘ప్రచార రథం’పై అభ్యర్థి జీవన్‌ రెడ్డి, కేటీఆర్‌, సురేష్‌ రెడ్డి.. ఇంకా కొందరు ముఖ్య నేతలు ఉన్నారు. భారీ ర్యాలీ కావడంతో, వాహనం ముందు వైపు కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో ఉండటంతో వాహనాన్ని చాలా జాగ్రత్తగా డ్రైవర్‌ తోలుతున్నాడు. ఇంతలో కార్యకర్తల తాకిడి, ముందు వెళ్తున్న వాహనం అడ్డు రావడంతో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా వాహనానికి పైనున్న గ్రిల్‌ ఊడిపోయింది. కేటీఆర్‌ ముందుకు ఒరిగిపడగా.. జీవన్‌ రెడ్డి, సురేష్‌ రెడ్డి ఇద్దరూ పైనుంచి కింద పడిపోయారు. ఈ ముగ్గురికీ స్వల్పగాయాలయ్యాయి. సడన్‌ బ్రేక్‌ వల్లే ఈ ఘటన జరిగిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

అంతా ఓకే కూల్‌!!

ఈ ఘటనపై కేటీఆర్‌, సురేష్‌ రెడ్డి స్పందించారు. సడన్‌ బ్రేక్‌ వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని.. అందరం సురక్షితంగా బయటపడ్డాం ఎవరికీ ఏమీ కాలేదన్నారు. మరోవైపు కేటీఆర్‌ కూడా స్పందిస్తూ.. అదృష్టవశాత్తు తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందవద్దని అభిమానులు, పార్టీ శ్రేణులను కోరారు. ప్రమాదం అనంతరం ఇక్కడ నామినేషన్‌ ప్రక్రియ ముగియగానే కొడంగల్‌ రోడ్‌ షోకు కేటీఆర్‌ బయల్దేరి వెళ్లారు. కేటీఆర్‌, సురేష్‌ రెడ్డి స్పందనతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కాస్త ఆందోళన తగ్గినట్లయ్యింది. మరోవైపు.. పలువురు పార్టీ ముఖ్యనేతలు స్వయంగా కేటీఆర్‌, జీవన్‌ రెడ్డికి ఫోన్‌ చేసి ప్రమాదంపై ఆరా తీశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !