Raytu Bandu Funds : రైతుబంధుకు ఈసీ బ్రేక్‌ !

0

రైతుబంధుకు  కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్‌ వేసింది. రైతుబంధు చెల్లింపులకు సంబంధించి.. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున.. చెల్లింపులకు ఇచ్చిన అనుమతి అదేశాలు ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. 2018 తరహాలోనే నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి చెల్లింపులు చేసేందుకు.. రెండ్రోజుల క్రితం ఈసీ అనుమతి ఇచ్చింది.సైలెన్స్‌ పీరియడ్‌, పోలింగ్‌ తేదీన చెల్లింపులు చేయవద్దని పేర్కొంది. శని, ఆది, సోమ వారాల్లో బ్యాంకు సెలవు ఉన్నందున మంగళవారం చెల్లింపులు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆ చెల్లింపులపై ఆర్థికమంత్రి హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ.. అసెంబ్లీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు అజయ్‌ వి నాయక్‌ పంపిన నివేదిక ఆధారంగా రైతుబంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ప్రచారం చివరి దశకు చేరిన క్రమంలో ఈసీ ఆదేశాలు పెనుదుమారానికి దారితీశాయి. రైతువిరోధి అయిన కాంగ్రెస్‌ పార్టీనే రైతుబంధు నిధులు ఆపిందని.. బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. నోటికాడి ముద్దను లాక్కున్నట్టుగా రైతుల పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారని మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. 

హారీష్‌రావు వ్యాఖ్యల వల్లే...

ఆర్థికమంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యల వల్లే రైతుబంధు చెల్లింపు అనుమతులను ఈసీ వెనక్కి తీసుకుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. నిజంగా రైతులకు మేలు చేసే ఉద్దేశం కేసీఆర్‌, హరీశ్‌కు లేదని విమర్శించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత మాత్రమే బీఆర్‌ఎస్‌కు ఉందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పది రోజుల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని.. 15 వేలు రైతు భరోసా ఇస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప.. రైతులకు న్యాయం జరగదని ఆరోపించారు. రైతుబంధు విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాటకం ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే విషయంలో బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధిలేదన్న ఆయన.. అన్నదాతలపై అంత ప్రేమ ఉంటే ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే తాను ముక్కలని విమర్శించారు. కుటుంబ పార్టీలను భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ వదిలిపెట్టదని.. భారత్‌​ రాష్ట్ర సమితి, హస్తం పార్టీలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతుబంధు నిలిపివేత విషయంలో అధికార - విపక్షాల మధ్య మాటల యుద్ధంతో ఎన్నికల ప్రచారం మరింత ఆసక్తికరంగా మారింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !