ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల బాధ్యత, హక్కు, విధి. అప్పుడే అభ్యర్థులకు సంబంధించి ఓ స్పష్టమైన అవగాహన వస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టంచేసింది. అందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌తోపాటు అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 1961 ఎన్నికల నిబంధనలకు లోబడి ‘రూల్-4ఏ కింద నిర్దేశించిన ఫారం-26 రూపంలో అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాలి. అందులో అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలతోపాటు ఆస్తులు, అప్పుల వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. అభ్యర్థితోపాటు కుటుంబసభ్యులకు చెందిన వివరాలూ ఇవ్వాల్సి ఉంటుంది. భర్త లేదా భార్య, వారిపై ఆధారపడిన కుటుంబంలోని సభ్యులు, అవిభాజ్య హిందూ కుటుంబంలో కర్త అయితే అందుకు సంబంధించిన వివరాలు పేర్కొనాలి.
ఆస్తులు, అప్పుల వివరాలు
అన్ని రకాల ఆస్తులు... స్థిర, చర ఆస్తుల వివరాలతోపాటు చేతిలో, బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు, డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర సేవింగ్స్, షేర్లు, బాండ్లు, బీమా, ఇతరులకు ఇచ్చిన అప్పులు, తదితర అన్ని వివరాలు పొందుపర్చాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాలు... ఇలా అన్ని రకాల ఆస్తుల వివరాలు అఫిడవిట్ లో తప్పనిసరిగా పేర్కొనాలి. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు, నివాస భవనాలకు సంబంధించిన వివరాలూ పొందుపర్చాలి. అవి వారసత్వంగా వచ్చాయా... లేక కొనుగోలు చేశారా అన్నది తెలపాలి. ఒకవేళ కొనుగోలు చేస్తే అప్పటి ధర, ఆ తర్వాత అభివృద్ధి కోసం దానిపై పెట్టిన పెట్టుబడి, సంబంధిత వివరాలూ కూడా పేర్కొనాలి. స్థిరాస్థులకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్ విలువను పొందుపర్చాలి. అభ్యర్థితోపాటు కుటుంబసభ్యుల పేరిట రుణాలు ఉంటే వాటి వివరాలు సైతం అఫిడవిట్‌లో ప్రస్తావించాలి. కుటుంబ సభ్యుల పాన్ ఖాతాల వివరాలు విధిగా పేర్కొనాలి. 2019లో సవరించిన నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను రిటర్న్స్‌లో పొందుపర్చిన ఆదాయ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఏడాదివే కాకుండా గడచిన ఐదేళ్ల రిటర్న్స్‌లోని ఆదాయ వివరాలూ పేర్కొనాలి. విదేశాల్లో ఎలాంటి ఆస్తులు ఉన్నాయో..? వాటి నుంచి లబ్ది పొందుతున్న వివరాలు అఫిడవిట్‌లో పొందుపర్చాలి. అభ్యర్థితోపాటు భార్య లేదా భర్త వృత్తి, వారికి వచ్చే ఆదాయ మార్గాలు, ప్రభుత్వం లేదా ప్రైవేట్ కంపెనీల కాంట్రాక్టులు ఉంటే వాటి వివరాలు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నివాసాలు ఉపయోగిస్తే వాటికి సంబంధించిన వివరాలు, నో-డ్యూస్ ధ్రువపత్రాలు జతపర్చాలి. వీటితోపాటు అభ్యర్థుల నేరచరిత్రకు సంబంధించిన వివరాలు అఫిడవిట్‌లో తప్పనిసరిగా పొందుపర్చాలి.
అభ్యర్థి క్రిమినల్ వివరాలు
వారిపై నమోదైన క్రిమినల్ కేసులు, వాటి వివరాలు పేర్కొనాలి. ఒకవేళ ఏదైనా కేసులో న్యాయస్థానాలు గతంలో శిక్ష విధించినా, వాటిపై అప్పీల్‌కు వెళ్లినా వాటి వివరాలతోపాటు ప్రస్తుత స్థితిని అఫిడవిట్‌లో తెలపాల్సి ఉంటుంది. అన్నింటితోపాటు అభ్యర్థుల సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలు కూడా పొందుపర్చాలి. అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్‌ను నోటరీ చేయించాల్సి ఉంటుంది. ఈ అఫిడవిట్‌లో పొందుపర్చిన సమాచారం పూర్తిగా సరైనదేనని అభ్యర్థి ప్రమాణం చేయాలి. సాధారణంగా నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేస్తారు. ఒకవేళ అభ్యర్థి తరపున వేరే ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే.. సదరు అభ్యర్థి తను ఉన్న ప్రాంతంలోని మెజిస్ట్రేట్ ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారైతే అక్కడి భారత ఎంబసీ నిర్ధేశించిన వారి వద్ద ప్రమాణం చేయాలి.
తప్పుడు సమాచారం ఇస్తే వేటు
అఫిడవిట్‌లో ఏ ఒక్కకాలమ్ ఖాళీగా వదలరాదని ఈసీ స్పష్టంచేసింది. సంబంధం లేకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది. అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించిన అనంతరం అందులో ఏదైనా సమాచారం లేకపోతే రిటర్నింగ్ అధికారి సదరు అభ్యర్థికి నోటీసు ఇస్తారు. అభ్యర్థి పూర్తి వివరాలతో కూడిన రివైజ్డ్ అఫిడవిట్ సమర్పించాలి. పూర్తిస్థాయి వివరాలతో అఫిడవిట్ లేకపోతే నామినేషన్‌ను స్క్రూట్నీ వేళ తిరస్కరిస్తారని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ప్రతులను రిటర్నింగ్ అధికారులు నోటీసు బోర్డుపై ఉంచుతారు.అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టప్రకారం శిక్ష : దాంతోపాటు 24 గంటల్లోపు వాటిని వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అభ్యర్థి తన రివైజ్డ్ అఫిడవిట్‌ను సమర్పిస్తే దాన్ని కూడా పొందుపరుస్తారు. ఒకవేళ అభ్యర్థి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నా కూడా.. వెబ్ సైట్‌లో ఉంచిన అఫిడవిట్ మాత్రం అలాగే ఉంటుంది. అఫిడవిట్‌లో పొందుపర్చే అన్ని వివరాలకు సదరు అభ్యర్థి పూర్తిబాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వచ్చిన పిటిషన్ల ఆధారంగా ఇటీవల న్యాయస్థానాలు కొందరిపై అనర్హతా వేటు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.