అహ్మదాబాద్ వేదికగా ప్రపంచకప్ ఫైనల్ పోరుకు ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. టోర్నీలో అజేయ జైత్రయాత్ర సాగిస్తూ ఫైనల్ చేరిన టీమిండియా.. తుదిపోరులోనూ ఇదే ఊపు కొనసాగించి ముచ్చటగా మూడోసారి ట్రోఫిని పట్టేయాలని గట్టి పట్టుదలతో ఉంది. అటు ఆస్ట్రేలియా సైతం ఆరోసారి ఛాంపియన్లుగా నిలవాలని కలలు కంటోంది. న్యూజిలాండ్ మీద గెలుపొంది టీమిండియా.. సఫారీలను చిత్తు చేసి ఆస్ట్రేలియా ఫైనల్ పోరులోకి అడుగుపెట్టాయి. ఫైనల్ పోరుకు ముందు ఇరుజట్ల బలాబలాలను ఓ సారి పరిశీలిద్దాం. వన్డే క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా, ఇండియా ఇప్పటివరకూ 150 వన్డేలలో ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో టీమిండియా 57 మ్యాచ్‌లలో గెలుపొందగా.. ఆస్ట్రేలియా 83 మ్యాచ్‌లలో విజయం సాధించింది. పది మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. ఇరు జట్ల మధ్య వన్డే ప్రపంచకప్‌కు ముందు మూడు వన్డేల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
టాస్ కీలకం కానుందా ?
ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇరుజట్లూ ఇప్పటి వరకూ13 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో ఎనిమిది సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా.. టీమిండియా ఐదు మ్యాచ్‌లలో గెలుపొందింది. ఆఖరి మూడు మ్యాచ్‌లలో భారతజట్టు రెండుసార్లు ఆస్ట్రేలియా మీద గెలుపొందింది. టీమిండియా ఓడిపోయిన మ్యాచ్‌లలో 2003 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కూడా ఒకటి. నాటి ఓటమికి రోహిత్ సేన ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ఇదే సమయంలో టీమిండియా ఆస్ట్రేలియా మీద గెలిచిన మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేస్తూ గెలిచినవి మూడు మ్యాచ్‌లు కాగా.. మరో రెండిరటిలో ఛేజింగ్ చేస్తూ నెగ్గింది. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా మనమీద నెగ్గిన ఎనిమిది మ్యాచ్‌లలో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ గెలిచినవే ఏడు మ్యాచ్‌లు ఉన్నాయి. ఓ మ్యాచ్‌లో మాత్రమే ఆస్ట్రేలియా ఛేజింగ్‌లో విజయం సాధించింది. ఈ లెక్కలన్నీ పరిశీలించిన తర్వాత.. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలని, ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం నిర్దేశిస్తే విజయం మనదేనని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. అలాగే భారత గడ్డ మీద రెండు జట్లు 71 మ్యాచ్‌లలో తలపడ్డాయి. వీటిలో 33 సార్లు ఇండియా, 33 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా గెలుపొందింది. మరో ఐదు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కొనసాగుతున్నారు. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రెట్‌లీ అగ్రస్థానంలో ఉండగా.. కపిల్ దేవ్, మిచెల్ జాన్సన్ ఆ తర్వాతి స్థానాలలో ఉన్నారు.
బ్యాటింగా ? బోలింగా ?
ఆదివారం అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌పై చర్చ జోరందుకుంది. ఈ మైదానంలో 11 పిచ్‌లున్నాయి. ఒకటి నుంచి అయిదు పిచ్‌లు నల్లమట్టితో కూడినవి. వీటిపై బౌన్స్ లభిస్తుంది. ఎర్రమట్టితో కూడిన 6 నుంచి 11 పిచ్‌లు త్వరగా మందకొడిగా మారతాయి. ఈ ఫైనల్ నల్లమట్టి పిచ్‌పైనే జరిగే అవకాశముంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకైతే ఇక్కడి పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా సహకరించింది. ఈ టోర్నీలో ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఛేదనలో జట్లు మూడు నెగ్గాయి. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మొదట ఆస్ట్రేలియా చేసిన 286 పరుగులే ఈ టోర్నీలో ఇక్కడ అత్యధిక స్కోరు. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదట 282 పరుగులు చేయగా.. ఛేదనలో న్యూజిలాండ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 36.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పాకిస్థాన్‌ను మొదట 191 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఛేదనలో మూడు వికెట్లే కోల్పోయి 30.3 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. ఓవరాల్‌గా ఇప్పటివరకూ ఇక్కడ 32 వన్డేలు జరిగితే.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 17, ఛేదన జట్టు 15 మ్యాచ్‌ల్లో గెలిచాయి. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 237 మాత్రమే.