హిందువులకు కార్తిక మాసం అత్యంత పవిత్రమైనది. కార్తిక మాసం దీపావళి పండగ మరునాడు ప్రారంభమవుతుంది. కానీ ఈ సారి దీపావళి పండగ మరుసటి రోజు కాకుండా రెండో రోజు నుంచి మొదలవుతోంది. హిందూ సంప్రదాయాలల్లో కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపాల కాంతితో కళకళలాడే ఆలయాలు.. శివనామస్మరణలు, భక్తుల ఉపవాసాలు, అయ్యప్ప దీక్ష.. కార్తిక మాస ప్రత్యేకతలు. హరిహరులకు ఇష్టమైన మాసంగా పరిగణించే ఈ నెలలో చేసే పూజలకూ, వ్రతాలకూ విశేషమైన ఫలితం ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా దీపావళి తరువాతి రోజు నుంచి కార్తికం ప్రారంభమవుతుంది. అయితే ఈసారి దీపావళి తర్వాత రెండో రోజున కార్తిక మాసం మొదలవుతుంది. ఎందుకంటే.. శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథినే నెల ప్రారంభానికి సూచనగా తీసుకుంటారు. అమావాస్య తిథి.. నవంబర్ 12న మొదలై.. నవంబర్ 13న సోమవారం వరకు ఉంది. నవంబర్ 14న మంగళవారం సూర్యోదయం సమయానికి పాడ్యమి తిథి ఉండటంతో ఆ రోజు నుంచి ఆకాశదీపం ప్రారంభమవుతోంది. అంటే నవంబర్ 14వ తేదీ మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతోందని పండితులు చెబుతున్నారు.
కార్తిక మాసం అని పేరు ఎలా వచ్చింది?
చంద్రుడు పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తికమనే పేరు వచ్చింది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరిని పూజించినా ఇద్దరూ సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెలలో చేసే జపం, ధ్యానం, నదీస్నానం, దానం, ఆరాధనతో సకల శుభాలూ కలుగుతాయని ప్రజల నమ్మకం. 2023 నవంబర్ 14వ తేదీ మంగళవారం పాడ్యమి తిథితో కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. అదే రోజు గోవర్ధన పూజ కూడా చేస్తారు.
సోమవారానికి ప్రాధాన్యత
కార్తిక మాసంలో సోమవారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం అంటే శివుడికీ ఇష్టం కాబట్టి ఈ నెలలో వచ్చే సోమవారాల్లో ఉపవాసం ఉండి, శివుడిని ఆరాధించి.. సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం తరువాత దీపాలను వెలిగించి భోజనం చేస్తే సకల శుభాలూ కలుగుతాయని అంటారు. అంతే కాకుండా ఈ కార్తికంలోనే అయ్యప్ప దీక్షను స్వీకరిస్తారు. కారణం ఏంటంటే.. అయ్యప్పను హరిహరసుతుడిగా భావిస్తారు. మకర సంక్రమణ సమయంలో స్వామి మకరజ్యోతి రూపంలో ఆవిర్భవిస్తాడని ఓ నమ్మకం. ఆ జ్యోతిని చూసేందుకు మండలంపాటు(41 రోజులు) దీక్షను చేపట్టి స్వామి సన్నిధానానికి చేరుకుంటారు భక్తులు.
కార్తీక మాసంలో చేసే స్నానంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
చలి కాలం వచ్చిందంటే.. కార్తీక మాసం వచ్చినట్టే. నెల రోజులు శివయ్యను తలుచుకుంటే చేసే స్నానాల్లో, పూజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నెల వచ్చిందంటే చాలా మంది నాన్ వెజ్ తినడం మానేసి.. పూజలు చేస్తూంటారు. హిందూ పండుగల్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉంటాయి. కార్తీక మాసం వచ్చిందంటే తెల్లవారు జామునే లేచి స్నానాలు చేసి పూజలు చేస్తూంటారు. ఈ నెల రోజులు చలిని శరీరంలో తట్టుకుంటే.. కొత్త ఉత్తేజితంగా మారుతుందని పెద్దలు చెబుతూంటారు.
కొత్త ఉత్తేజం వస్తుంది
ప్రతి రోజూ చేసే స్నానం వేరు. కార్తీక మాసంలో చేసే స్నానం వేరంటారు పెద్దలు. సాధారణంగా చలికి ఉదయం త్వరగా లేవలేం. బద్ధకంగా ఉండి.. ఏ పని చేయాలనిపించదు. అందుకే వేకువ జామునే లేచి స్నానాలు చేయడం వల్ల బద్ధకం వదిలి.. కొత్త ఉత్తేజం వస్తుంది. అంతే కాదు పనులు కూడా త్వరగా పూర్తి అవుతాయి. తొందరగా నిద్ర లేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి:
అంతే కాకుండా వేకువ జామునే లేవడం వల్ల అన్ని పనులు త్వరగా పూర్తి అయిపోతాయి. అలాగే ఉదయాన్నే లేచి నడవటం కూడా ఓ చక్కటి వ్యాయామం. పైగా నదీ జలాల్లో స్నానం చేయడం వల్ల.. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరమై మానసిక ఆహ్లాదం నెలకొంటుంది. అందుకే చలి కాలంలోనే చాలా పండుగలు వస్తాయి.
నదులు, సముద్రాల్లో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం
కార్తీక మాసంలో ముఖ్యంగా కాలువ, నది, సముద్రాల్లో స్నానం చేయడం మంచిదని అంటారు. ఎందుకంటే కార్తీక మాసం వచ్చే సరికి.. వర్షాకాలం పూర్తి అయిపోయి.. నదుల ఉధృతి తగ్గి.. మలినాలన్నీ అడుక్కి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. ఆ నీటిలో స్నానం చేస్తే చాలా ఆరోగ్యం. అందుకే నదుల్లో, సముద్రాల్లో, కాలువల్లో స్నానాలు చేయాలని పూర్వం పెద్దలు చెబుతూండేవారు.
అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి
అలాగే కార్తీక మాసంలో పెట్టే దీపానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో నువ్వుల నూనె, నెయ్యితో పెట్టిన దీపం నుంచి వచ్చిన పొగను పీల్చడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతే కాదు చలికి ఆ దీపం వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇలా కార్తీక మాసంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.