తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఆయా పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థులంతా ఖరారయ్యారు. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను వెల్లడిరచాయి. బీఆర్‌ఎస్ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ మేరకు అభ్యర్థులకు బీ ఫాంలు ఇచ్చింది. కాంగ్రెస్ 118 చోట్ల పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేస్తూ 8 నియోజకవర్గాలను జనసేనకు కేటాయించింది. మజ్లిస్ తొమ్మిది స్థానాల్లో, సీపీఎం 15, బీఎస్పీ 100 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి కొత్తగూడెం బరిలో దిగిన వనమా వెంకటేశ్వర్‌రావు(79) రాష్ట్రంలో పోటీ చేస్తున్న వారిలో అత్యధిక వయసున్న అభ్యర్థిగా, కాంగ్రెస్ నుంచి పాలకుర్తిలో పోటీ చేస్తున్న యశస్విని(26) అతి పిన్న వయసున్న అభ్యర్థినిగా నిలిచారు.
రెండేసి స్థానాల్లో ముగ్గురు పోటీ : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (హుజూరాబాద్, గజ్వేల్), బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ (గజ్వేల్, కామారెడ్డి), పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (కొడంగల్, కామారెడ్డి) పోటీ చేస్తున్నారు.
అసెంబ్లీ బరిలో ఏడుగురు ఎంపీలు : ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఏడుగురు ఎంపీలు పోటీ చేస్తున్నారు. వారిలో బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి(దుబ్బాక).. మల్కాజిగిరి, నల్గొండ, భువనగిరి, కాంగ్రెస్ ఎంపీలు రేవంత్‌రెడ్డి(కొడంగల్, కామారెడ్డి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్).. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ (కరీంనగర్), సోయం బాపురావు(బోథ్), ధర్మపురి అర్వింద్(కోరుట్ల) ఉన్నారు.
ఐదుగురు ఎమ్మెల్సీలు : ఈసారి అయిదుగురు ఎమ్మెల్సీలు పోటీ చేస్తున్నారు. వారిలో బీఆర్‌ఎస్‌కు చెందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్‌పూర్), పాడి కౌషిక్‌రెడ్డి(హుజూరాబాద్), కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి(జగిత్యాల)తో పాటు.. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి) బరిలో నిలిచారు.