Telangana Elections : నేరచరుతులకే ఎమ్మేల్యే టికెట్లు !

0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితులే అధికంగా ఉన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మందికి నేర చరిత్ర ఉందని ఎన్నికల కమిషన్‌ కు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో తేలింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 360 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీల తరపున పోటీచేస్తుండగా, వారిలో 226 మంది నేరచరితులు కావడం విశేషం.

48 శాతం మంది అభ్యర్థులు నేరచరితులే

తెలంగాణ రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో 48 శాతం మంది అభ్యర్థులు నేరచరితులేని తేలింది. అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించగా 84 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు 540 కేసుల్లో నిందితులని వెల్లడైంది. బీజేపీకి చెందిన 78 మంది అభ్యర్థులు 549 కేసుల్లో ఉన్నారని అభ్యర్థుల అఫిడవిట్లే చెబుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 58 మంది అభ్యర్థులు 120 కేసుల్లో నిందితులని తేలింది. ఎంఐఎం కు చెందిన ఆరుగురిపై 11 కేసులున్నాయి. అయితే ఎక్కువ మంది అభ్యర్థులకు తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులున్నాయి. అభ్యర్థుల్లో ఎక్కువమంది నేరచరితులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో నేరచరితులు ఎక్కువ మంది బరిలో నిలిచిన నేపథ్యంలో ఓటర్లు ఆలోచించి ఓటేయాలని పద్మనాభరెడ్డి కోరారు.

అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై కేసులు

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై 9 కేసులు పెండిరగులో ఉన్నాయి. అలానే కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ పై 10 కేసులున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎ రేవంత్‌ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు నమోదైనాయి. కాంగ్రెస్‌ అభ్యర్థులు వెడమ బుజ్జి (ఖానాపూర్‌)పై 52 కేసులు, ప్రేమ్‌ సాగర్‌ రావుపై 32, పి శ్రీనివాస్‌ పై 24, జయప్రకాశ్‌ రెడ్డిపై 20 కేసులు ఉన్నాయి. బీజేపీ నేతల్లో గోషామహల్‌ అభ్యర్థి రాజాసింగ్‌ పై అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ పై 59, బోధ్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపూరావుపై 55 కేసులు, మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీపై ఆరు కేసులున్నాయి. ఈటల రాజేందర్‌ పై 40, రఘునందన్‌ పై 27, ధర్మపురి అర్వింద్‌ పై 17, మేడిపల్లి సత్యంపై 18 కేసులున్నాయి. దీంతో పాటు చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్‌ చేయాలని అనుకున్నా, ఏ రాజకీయ పార్టీ కూడా మహిళలకు సీట్లు కేటాయించలేదు. నేరచరితులకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వవద్దని చెబుతున్నా ప్రధాన రాజకీయపక్షాలు పార్టీ టికెట్లను వారికే ఇస్తున్నాయి. దీంతో నేరచరితులు ఎక్కువమంది చట్టసభల్లో ఉండటం వల్ల రౌడీరాజ్యం అయిపోతుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !