మొన్నటి దాకా టీమ్‌లో లేడు. డ్రిరక్స్ అందివ్వడానికి తప్ప మైదానంలోకి దిగింది లేదు. ఎప్పుడు ఛాన్సు ఇస్తారా అని ప్రేక్షకులు విసిగిపోయారేమో కానీ.. అతను మాత్రం నిరాశ చెందలేదు. ఎట్టకేలకు నాలుగు మ్యాచ్‌ల తర్వాత అవకాశం వచ్చింది. ఇంకేముంది.. ఏకంగా ప్రపంచకప్ హిస్టరీలో ఇండియా తరుఫున రికార్డు సృష్టించాడు. అతనే మహ్మద్ షమీ. కివీస్ మ్యాచ్ అనంతరం షమీ గురించిన ఆసక్తికర విషయాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అతని సక్సెస్‌కు కారణాలేంటో తెలియజెప్పాయి..మహ్మద్ షమీ.. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా సెన్సేషన్. అవకాశాల కోసం ఎదురుచూసి ఆకలిగొన్న పులిలా విజృంభించాడు షమీ. నాలుగు మ్యాచ్‌ల పాటు తనను పక్కనబెట్టినా.. వచ్చీ రాగానే తానేంటో నిరూపించుకున్నాడు. కివీస్ మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీయటంతో పాటుగా ఐదు వికెట్లు తీసి ప్రపంచకప్‌లో రెండు సార్లు ఐదు వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. మిగతా బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బంది పడిన పిచ్ మీద షమీ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. ఇక శాంట్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ముంబై వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టి మరోసారి సత్తా చాటాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకోవడంతో పాటు పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు (45) పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. జహీర్ ఖాన్(44), జవగళ్ శ్రీనాథ్(44)ను దాటేసి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాదు ప్రపంచకప్ లో అత్యధికంగా ఏడు సార్లు 5 వికెట్లు తీసిన భారత బౌలర్‌గానూ ఘనతకెక్కాడు.
శ్రమకు దక్కిన ఫలం
అయితే ఇదంతా ఒక్కరోజులోనో.. ఒక్క రాత్రిలోనో జరిగిపోలేదు. దీని వెనుక షమీ కష్టం ఉంది.. కొన్నేళ్ల శ్రమ ఉంది. అంతకుమించి సొంతూరు అలీనగర్ ఉంది. స్టార్ క్రికెటర్‌గా మారి కోట్ల రూపాయలు సంపాందించడం గొప్ప విషయమేమీ కాదు. కానీ ఆట కోసం కోట్లు ఖర్చుపెట్టడం గొప్ప. ఎంత ఎదిగినా ఆటలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని తపన పడటం గొప్ప. అలాంటి ప్లేయర్లలో ఒకడు మహ్మద్ షమీ. షమీకి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ప్రపంచకప్ కు కొద్ది రోజుల ముందు వ్యక్తిగత సమస్యలతో చాలా ఇబ్బంది పడ్డాడు. కోర్టు కేసులతో సతమతమయ్యాడు. అయితే వాటి నుంచి త్వరగా బయటపడి ఎంతో పట్టుదలతో మైదానంలో మళ్లీ తానేంటో కొత్తగా నిరూపించుకున్నాడు. టీమిండియా పేసర్ల టాప్ త్రయంలో కీలకంగా మారాడు. అందుకు తగ్గట్టుగానే ఎంతో శ్రమించాడు. అందుకే శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన తర్వాత షమీ చాలా ఎమోషనల్ అయ్యాడు. తాను ప్రస్తుతం ఈ స్థాయికి చేరడానికి కారణమైన తన దైవం అల్లాకు వినమ్రంగా ధన్యవాదాలు తెలిపాడు. తన శ్రమ ఫలించి రిథమ్ అందుకోవడానికి అల్లాయే కారణమని చెప్పాడు.
సొంతూరులో గ్రౌండ్ నిర్మించుకుని...
ఉత్తరప్రదేశ్‌లోని సాహస్‌పుర్ అలీనగర్ మహ్మద్ షమీ సొంతూరు. ఇక్కడే వివిధ రకాల పిచ్‌లతో సొంతంగా క్రికెట్ గ్రౌండ్ తయారు చేయించాడు మహ్మద్ షమీ. ఈ పిచ్‌ల మీద చేసిన బౌలింగ్ ప్రాక్టీస్.. వైట్ బాల్ క్రికెట్లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనలకు కారణమవుతోంది. మెరుగైన సౌకర్యాల కోసం సిటీకి వెళ్ల్ల్సాని అవసరం లేకుండా, ప్రాక్టీస్‌కు ఇబ్పంది కలగకుండా ఉండేలా వివిధ రకాల పిచ్‌లతో షమీ ఈ గ్రౌండ్ నిర్మించాడు.క్రికెట్ తప్ప షమీకి మరో జీవితం లేదని అతని గురించి తెలిసిన వాళ్లు చెబుతుంటారు. ఇండియాకు ఆడనప్పుడు.. నైపుణ్యాలను మరింతగా ఎలా మెరుగుపరుచుకోవచ్చనే దానిపైనే ఆలోచిస్తూ ఉంటాడని చెప్తారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన విండీస్ టూర్ నుంచి విరామం దొరికిన సమయంలో షమీ ఈ గ్రౌండ్లోనే ప్రపంచకప్ కోసం ప్రాక్టీస్ సాధన ప్రారంభించాడని షమీ చిన్నప్పటి కోచ్ మహ్మద్ బద్రుద్దీన్ తెలిపారు. సొంత ఖర్చుతో నిర్మించుకున్న ఆ గ్రౌండ్లోనే షమీ నిరంతరం సాధన చేస్తుంటాడని వివరించారు. ప్రపంచకప్‌కు చాలా రోజుల ముందు వరకు షమీ అసలు జట్టులోకి వస్తాడా, రాడా అనే చర్చ నడిచింది. జట్టులోకి వచ్చిన తర్వాత కూడా అతడికి మొదటి మూడు మ్యాచుల్లో ఆడే అవకాశం రాలేదు. ఆలస్యంగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా.. వచ్చిన చాన్స్ ను సద్వినియోగం చేసుకుని చెలరేగుతున్నాడు. దీనికోసం షమీ ఎంతో శ్రమించాడు. తన సొంతూరులో వివిధ రకాల పిచ్‌లపై గంటల తరబడి అవిశ్రాంతంగా ప్రాక్టీస్ చేశాడు. దాని కారణంగానే ఇప్పుడు ఇరగదీస్తున్నాడు. ధర్మశాలలో తాను ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే 5 వికెట్లు పడగొట్టి ఎంట్రీని ఘనంగా చాటాడు. టీమిండియాకు తానెంత విలువైన బౌలర్ నో చాటిచెప్పాడు.
రిథమ్‌మే ముఖ్యం.
బంతిని సరైన దిశలో సంధించడమే తన సక్సెస్ సీక్రెట్ అని షమీ తెలిపాడు. ‘‘ఎప్పటిలాగే బంతిని మంచి రిథమ్ తో సరైన ప్రాంతాల్లో వేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్లలో లయను కోల్పోతే దాన్ని తిరిగి సాధించడం చాలా కష్టం. అందుకే టోర్ని ప్రారంభం నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. ముఖ్యంగా వైట్ బాల్ కరెక్ట్ ఏరియాలో పడితే పిచ్ నుంచి కచ్చితంగా సహకారం అందుతుంది. అంతే తప్ప ఇదేమీ రాకెట్ సైన్ కాదు. రిథమ్, మంచి ఆహారం, మైండ్ ను ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు ప్రజల ప్రేమ కూడా ముఖ్యమ’’ని షమీ వివరించాడు.