Telangana Elections : వలస ఓటర్లపై ఫోకస్‌...ఖర్చులన్నీ అభ్యర్థులవే !

0

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. గెలుపు కోసం పార్టీలు పలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి ఓటు కీలకమే. అందుకే పార్టీలు నియోజకవర్గాల్లోని ఓట్లే కాకుండా.. వలస ఓట్లపై ఫోకస్‌ పెట్టాయి. వారిని గుర్తించి.. కలుసుకునే పనిలోపడ్డాయి. ఎందుకంటే గెలుపు, ఓటముల్లో ఈ ఓట్లే కీలకం కానున్నాయి. ఇందుకోసం నేతలు ఎలాగైనా వారిని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఖర్చు ఎంతైనా వెనకడుగు వేయడం లేదు.

ఒక్కసారి ఊరికి వచ్చిపో. నీ ఓటు నాకు వేసిపో

అందుకే ఓవైపు నియోజకవర్గాల్లో ఓట్లు అభ్యర్థిస్తూనే.. మరోవైపు జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను కనిపెట్టే పనిలో కొందరు నాయకులు నిమగ్నమయ్యారు. వీరి కోసం ప్రత్యేకంగా కొందరినీ నియమించారు అంటే ఓటుకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పోలింగ్‌​ రోజున దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన కార్మికులను తీసుకొచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పొట్ట చేత పట్టుకుని, సొంతూళ్లను వదిలిపోయిన వారిని బాబ్బాబు.. ఒక్కసారి ఊరికి వచ్చిపో. నీ ఓటు నాకు వేసిపో.. అంటూ రాజకీయ పార్టీల నాయకులు ప్రాధేయపడుతున్నారు. సోలాపూర్‌, ముంబయి, పుణె వెళ్లి మరీ అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి జీవనోపాధి పొందుతున్న వారి రాక కోసం.. పెద్దఎత్తున ఆశలు పెట్టుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో వలస ఓటర్లు ఉండటమే ఇందుకు కారణం.

తెలంగాణ ఎన్నికల్లో యువత ఓటే కీలకం

ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు చేసుకుంటూ జీవిస్తున్న కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. తెలంగాణలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకంగా, మరో 15 చోట్ల పాక్షికంగా వలస ఓటర్లు ప్రభావం చూపుతారని పార్టీలు అంచనా వేస్తున్నాయి. వీరి కుటుంబాలకు సొంత గ్రామాల్లో ఆస్తిపాస్తులు ఉండటంతో.. సమాచారాన్ని సేకరిస్తున్న నేతలు.. వారిని రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 

ఓట్లు మీవి.. ఖర్చులు మావి 

డీసీఎంలు, రైళ్లు, బస్సులు ఇలా.. మీరు ఎలా వస్తామంటే అలా.. ఏర్పాట్లు చేస్తామని వలస ఓటర్లను నేతలు కోరుతున్నారు. రానూపోనూ ఖర్చులనూ చెల్లిస్తామని చెబుతున్నారు. పోలింగ్‌ నాడు వచ్చి, ఓటేసిపోవాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో బస్సుల్లో వస్తే ఒక్కొక్కరికి రూ.1500 వరకు ఖర్చు అవుతుందని.. ప్రత్యేకంగా డీసీఎంలు, లారీలు అద్దెకు తీసుకుంటే కొంత తక్కువ ఖర్చు అవుతుందని వారు లెక్కించారు. అందుకే అంత మొత్తం వారికి చెల్లించేలా నాయకులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌, వనపర్తి, వికారాబాద్‌, నారాయణపేట జిల్లాలకు చెందిన కొన్ని ప్రధాన పార్టీల నేతలు.. ఇటీవల మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో కూలీలుగా పని చేస్తున్న వారిని సంప్రదించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !