ప్రజల సంపదను బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని ఆరోపించారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోపిడీ జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తామని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్టును రాహుల్ పరిశీలించారు. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన బ్యారేజీ రెండేళ్లలోనూ దెబ్బతినడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
మేడిగడ్డ పరిశీలించిన రాహుల్
మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ నేత రాహుల్ పరిశీలించారు. మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సుకు రాహుల్ గాంధీ హాజరై ప్రసంగించారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికలు అని పేర్కొన్నారు. నిధుల దోపిడీ, నిర్మాణంలో అక్రమాల వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టు పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. దర్యాప్తు సంస్థల అధినేత అమిత్‌షా అవినీతిపై మోదీ చర్యలు తీసుకోలేదని రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతున్న దోపిడీ, అన్యాయాన్ని చూసేందుకే వచ్చినట్టు చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలతో ఈ తొమ్మిదిన్నరేండ్లలో లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌కు, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు ఏటీఎంలా మారిందని విమర్శించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ దోచుకోవడం వల్ల మహిళలు ఎక్కువగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒకవైపు.. కాంగ్రెస్ మరోవైపు ఉందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ కు బీజేపీ, ఎంఐఎం సహకరిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఇచ్చి బీఆర్‌ఎస్ ను గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బ్యారేజీ పరిశీలనకు పోలీసులు ఇతరులెవరికీ అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ కార్యకర్తలను బ్యారేజీ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుంటూ బ్యారేజీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దొరలు వర్సస్ ప్రజలు
ఈ ఎన్నికలు దొరల తెలంగాణ కు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని రాహుల్ చెప్పుకొచ్చారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2500 అందిస్తామని హామీ ఇచ్చారు. మోదీ, కేసీఆర్ పాలనలో సిలిండర్ ధర రూ.12 వందలకు చేరిందని విమర్శించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాహుల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీకు ఇచ్చిన హామీలు నెరవేరస్తామన్నారు. దొరల సర్కారును పారదోలి ప్రజల సర్కార్ ను ఏర్పాటు చేయాలన్నారు.