Congress : కాంగ్రెస్‌ గెలవకుంటే యువత అడవి బాట... రేవంత్‌ రెడ్డి

0

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్‌ ఘనపూర్‌లో కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. యువకులకు ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతో సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవకపోతే.. ఉద్యోగాలు రావనే భయంతో యువత అడవిబాట పట్టే అవకాశముందని పేర్కొన్నారు. కేసీఆర్‌ వంద తప్పులు పూర్తయ్యాయని.. కాంగ్రెస్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రేవంత్‌ రెడ్డి. ’’ పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రజలకు చేసిందేమీ లేదు.ఏపీలో అధికారం కోల్పోతామని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్‌ వస్తే రైతుబంధు బందవుతుందని ప్రచారం చేస్తుంది. ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తాం. ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇస్తాం. విద్యార్థుల చదువుల కోసం రూ.5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తాం. కాంగ్రెస్‌ గెలవకుంటే ఉద్యోగాలు రావనే భయంతో యువత అడవి బాట పట్టే అవకాశముంది.’’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు. స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి తాను బాధ్యత వహిస్తానని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే.. నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రితో పాటు డిగ్రీ కాలేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఆక్షేపించారు. ఆంధ్రాలో అధికారం కోల్పోతామని తెలిసినా సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చారని.. అటువంటి పార్టీకి ఒక్కఛాన్స్‌ ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తామన్నారు.

కోటలు దాటుతున్న మాటలు ` హద్దులు దాటి హామీలు !

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రేవంత్‌ రెడ్డి యువతను టార్గెట్‌ చేశారు. కేసీఆర్‌ వస్తే ఉద్యోగాలు రావు, మళ్ళీ కేసీఆర్‌ గెలిస్తే యువత అంతా అడవి బాట పట్టే అవకాశం ఉంది అని వారిని భయపెట్టే ప్రయత్నం చేశారు. యువతను కాంగ్రెస్‌ వైపు మళ్ళించేందుకు నిరుద్యోగానికి సాకుగా చూపుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తుందా ?  కాంగ్రెస్‌ గ్యారెంటీ ఇస్తుందా ? అధికారం కోసం అన్ని వర్గాల్ని మాయమాటలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తారు. మరో వైపు నియోజకవర్గ అభివృద్ధికి తాను బాధ్యత వహిస్తానని హామీ ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్‌ సిఎం అభ్యర్థి నేనే అని రేవంత్‌ రెడ్డి తనకు తానే ప్రకటించుకుంటున్నారా ? కాంగ్రెస్‌ హై కమాండ్‌ భట్టి విక్రమాక్ర, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వంటి మిగిలిన వారిని ప్రక్కన పెట్టేస్తుందా ? ఇక హామీల విషయానికి వస్తే 6 గ్యారెంటీలు అని ఊదరకొడుతున్నారు. ఆ పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది. పథకాలకు సొమ్ము ఎక్కడి నుండి వస్తుంది ? అంటే ఏ ఒక్క నాయకుడైనా సమాధానం చెప్పగలరా. అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలకు డబ్బు లేవనే సాకు అన్ని పథకాలకు కోతలు విధించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ప్రజల సొమ్ముపై పెత్తనం కోసం ఆరాటం తప్పించి పన్నుల భారం లేకుండా ప్రజల్ని ఏలే నాయకులు ఎప్పుడొస్తారో...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !