Subrata Roy..ఓ సామాన్యుడు నిర్మించిన సహారా వ్యాపార సామ్రాజ్యం !

0

ఇంతింతై...వటుడిరతై...అన్నట్లు సామాన్యుడు ఆశాకమంత ఎదగి...అక్కడి నుండి ఒక్కసారి కుప్పకూలిపోతే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది సుబ్రతా రాయ్‌ జీవన ప్రయాణం. 1978లో కేవలం రూ.2,000 మూలధనంతో ఆయన వ్యాపారం మొదలుపెట్టారు. మూడు దశాబ్దాల అనంతరం రూ. వేల కోట్లకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. సామాన్య మదుపరి నుంచి సేకరించిన రూ.10-20 కూడా అందులో ఉన్నాయి. ఇలా సమీకరించిన నిధులపై కేసులు మొదలయ్యాక, కోర్టులు, నియంత్రణ సంస్థల ముందుకు వెళ్లాల్సి వచ్చింది. మదుపర్ల మొత్తం డబ్బులు వెనక్కి ఇస్తామని ఆయన చివరి వరకు చెబుతూనే వచ్చారు.

దేశవ్యాప్తంగా సంచలనం..

ఎవరి నుంచి నిధులు సేకరించారనేందుకు ఆధారాలు అడిగితే.. ఏకంగా 128 ట్రక్కుల నిండా 31,000 బాక్సుల్లో పత్రాలను సెబీకి పంపారు. సెబీ ఒక గోదామును అద్దెకు తీసుకుని ఆటోమేటెడ్‌ రోబోటిక్‌ సిస్టమ్‌ను వినియోగించి మరీ ఈ పత్రాలను సర్దాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సహారా కేసులో 20 కోట్ల పేజీలను స్కాన్‌ చేసి, ఒక సర్వర్‌లో దాచాల్సి వచ్చింది. ఈ కేసుల్లో చిక్కుకోక ముందు.. ఆర్థిక సేవలు, స్థిరాస్తి, విమానయానం వంటి సేవలందించిందీ సహారా గ్రూప్‌. లండన్‌, న్యూయార్క్‌లలో పెద్ద హోటళ్లతో పాటు ఐపీఎల్‌ క్రికెట్‌ టీమ్‌, ఫార్ములా వన్‌ రేసింగ్‌ బృందం కూడా సంస్థకు ఉండేవి. భారత క్రికెట్‌, హాకీ బృందాలకు స్పాన్సర్‌గా ఈ గ్రూప్‌ ఉండేది. యాంబీ వ్యాలీ(మహారాష్ట్ర) సిద్ధమై ఉండి ఉంటే.. రాయ్‌కి ‘స్నేహితులైన’ క్రికెటర్లు, సినీతారలు, రాజకీయనాయకులకు అందులో విల్లాలు ఉండేవి.

ఎక్కడ మొదలైందీ కేసు..

రెండే రెండు ఫిర్యాదులు సుబ్రతా రాయ్‌ కార్పొరేట్‌ సామ్రాజ్యానికి బీటలు వారేలా చేశాయి. కొంత మంది మదుపర్ల బృందం చేసింది ఒక ఫిర్యాదైతే, రోషన్‌ లాల్‌ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మరొకటి. యాంబీ వ్యాలీ వంటి ప్రాజెక్టులను చేపట్టిన సహారా ప్రైమ్‌ సిటీ ఐపీఓకి రావాలని భావించింది. సెబీకి ముసాయిదానూ సమర్పించింది. ఆ సమయం (2009 డిసెంబరు 25)లోనే ‘ప్రొఫెషనల్‌ గ్రూప్‌ ఫర్‌ ఇన్వెస్టర్‌ ప్రొటక్షన్‌’ నుంచి సెబీకి ఫిర్యాదు అందింది. చాలా నెలలుగా ప్రజలకు కన్వర్టబుల్‌ బాండ్లను జారీ చేసి నగదు సేకరించినా.. ఆ వివరాలను ముసాయిదాలో పేర్కొనలేదన్నది ఫిర్యాదు సారాంశం. ఇదే తరహాలో రోషన్‌ లాల్‌ నుంచి కూడా 2010 జనవరి 4న లేఖ వచ్చింది. ఒకటిన్నర పేజీల్లో హిందీలో రాసిన ఆ లేఖ దేశంలో దుమారాన్నే రేపింది. ఆ తరవాత సరిగ్గా నాలుగేళ్ల మూడు నెలలకు తీహార్‌ జైలుకు రాయ్‌ వెళ్లాల్సి వచ్చింది.

ఎటువంటి తప్పూ చేయలేదు

సెబీ దర్యాప్తు చేపట్టిన అనంతరం, కేసు అలహాబాద్‌ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుదాకా వెళ్లింది. తాము ఎటువంటి తప్పు చేయలేదని, హామీ ఇచ్చిన ప్రతిఫలాలతో అందరి డబ్బులను వెనక్కి ఇస్తామని సహారా గ్రూప్‌ చెబుతూ వచ్చింది. అదే సమయంలో మదుపర్ల నుంచి నిధులు సేకరిస్తూనే ఉంది. అలహాబాద్‌ హైకోర్టుకు కేసు వచ్చినపుడు రూ.2,000 కోట్లు వసూలు చేయగా.. సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(శాట్‌)కు చేరిన సమయానికి సహారా రియల్‌ ఎస్టేట్‌ రూ.17,000 కోట్లు, సహారా హౌసింగ్‌ రూ.6,500 కోట్లు చొప్పున సేకరించాయి. మొత్తం 3.1 కోట్ల మంది మదుపర్లు కంపెనీ బాండ్లు కొనుగోలు చేశారు. అన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లోని మదుపర్ల కంటే ఈ సంఖ్య ఎక్కువ కావడం గమనార్హం.

మదుపర్ల డబ్బుల పరిస్థితి ఏమిటి?

సుబ్రతా రాయ్‌ మరణంతో ఇపుడు మదుపర్లకు చెల్లించాల్సిన నిధుల పరిస్థితి ఏమిటన్న విషయాన్ని అందరూ చర్చించుకుంటున్నారు. రూ.25,000 కోట్ల వరకు మొత్తాన్ని సెబీ వద్ద సహారా గ్రూప్‌ డిపాజిట్‌ చేసింది.  తాజా గణాంకాల ప్రకారం.. సెబీ ఇప్పటిదాకా (11 ఏళ్లలో) రూ.138 కోట్లను మదుపర్లకు వెనక్కి ఇచ్చింది.  వడ్డీతో కలిసి ఇంకా సెబీ అజమాయిషీలోని ఖాతాలో రూ.25,000 కోట్లు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే.. 95% మంది మదుపర్లకు నేరుగా రిఫండ్‌ చేశామని సహారా పేర్కొన్నప్పటికీ.. సుప్రీం ఆదేశాలతో ఈ నిధులనూ సెబీ వద్ద జమ చేయాల్సి వచ్చింది.

‘సహారా’ ఆస్తులు.. రూ.2.5 లక్షల కోట్లు

ఉద్యోగులు, స్నేహితులు సుబ్రతా రాయ్‌ని ‘సహారాశ్రీ’ అని పిలుస్తుంటారు. సహారా ఇండియా పరివార్‌కు ఆయన ఒక మేనేజింగ్‌ వర్కర్‌, చీఫ్‌ గార్డియన్‌ అనే అంటుంటారు. సాధారణంగా ఉపయోగించే ఎండీ, సీఈఓ వంటి పదాలను ఆయన వాడలేదు. కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం.. సంస్థకు 9 కోట్ల మందికి పైగా మదుపర్లు, వినియోగదార్లున్నారు. 30,970 ఎకరాల భూమి ఉంది. ఆస్తుల విలువ రూ.2,59,900 కోట్లుగా ఉంది. కోర్టు ఆదేశాలతో 2014 మార్చి 2న తీహార్‌ జైలుకు వెళ్లిన రాయ్‌, రెండేళ్ల పాటు అక్కడే ఉన్నారు. ఆయన తల్లి చాబి రాయ్‌ అంత్యక్రియల కోసం 2016 మే 6న బయటకు వచ్చారు. అప్పటి నుంచీ పెరోల్‌పై బయటే ఉన్నారు. మంగళవారం రాయ్‌ గుండెపోటుతో మరణించడంతో సహారా గ్రూప్‌ విషాదంలో మునిగింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !