చంద్రబాబు మెడికల్ బెయిల్ మీద మరింతకాలం ఉండడానికి వీలుగా మెడికల్ రిపోర్టు ఇచ్చినట్టుందని వైసీపీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చర్మ వ్యాధులను ప్రాణాంతక వ్యాధులన్నట్టు మెసేజ్ వచ్చేలా చేశాడన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘అనారోగ్యంతో ఉన్నప్పుడు కోర్టును రిక్వెస్ట్ చేయొచ్చు.. కోర్టు అనుమతిస్తే బెయిల్ వస్తుంది. ఆ కారణంతోనే చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ బెయిల్‌పై మరికొంత కాలం బయట ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. 14 గంటలకు పైగా కారులో ప్రయాణించి విజయవాడ రావడం చూస్తే సహజంగా కామెంట్ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఏఐజీ ఆసుపత్రి రిపోర్టు చూస్తే వైద్యులా, పొలిటికల్ డాక్టర్లా అన్నట్టు కనిపిస్తుందని సజ్జల దుయ్యబట్టారు. గుండె సంబంధిత ఇబ్బందులు ఉంటే వెంటనే స్టంట్ వేయటమో, బైపాస్ సర్జరీనో చేయాలి. అంబులెన్స్‌ని వెంట పట్టుకుని బయట తిరగమని డాక్టర్లు రిపోర్టు ఇచ్చారంటే ఇక వారిని ఏమనాలి?. రోగం ఉంటే వైద్యం చేయించుకోవటం సహజమే. కానీ క్యాన్సర్ లాంటి రోగం ఉందో లేదో పరీక్షలు చేయాలని రిపోర్టు రాయటం ఏంటి?. ఇలాంటి చిత్ర విచిత్రమైన రిపోర్టులు ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు సర్జరీలు చేయకపోతే మనిషి ఉంటాడో లేదో అన్నట్టుగా రిపోర్టులు తెచ్చుకోవటం చంద్రబాబుకే చెల్లింది’’ అని సజ్జల ఎద్దేవా చేశారు.
జైల్లో ఉండాలనీ మేము కోరుకోవటం లేదు.
పొలిటికల్ లైఫ్ గురించి డాక్టర్లు మాట్లాడటం చూస్తే కామెంట్ చేయక తప్పదన్నారు. కోర్టు వైద్యం చేయించుకోమని బెయిల్ ఇస్తే.. అంబులెన్స్‌తో బయట తిరగమని డాక్టర్లే చెపుతున్నారన్నారు. చంద్రబాబు జైల్లో ఉండాలని మేమేం కోరుకోవట్లేదని.. చంద్రబాబు లోపల ఉంటే మాకేం లాభం లేదన్నారు. చంద్రబాబు బయటకి వచ్చి సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు చేసిన స్కాం ఈ వంకలతో పక్కకి పోతోందన్నారు. పొలిటికల్ అవసరానికి సూడో మెడికల్ వ్యవహారం చేస్తున్నారని అందరూ గమనించాలన్నారు. మేనిఫెస్టో కోసం రెండు దేశాల అగ్రనాయకులు లాగా కూర్చున్నారని విమర్శించారు. ప్రజలకు చెవుల్లో క్యాలిఫ్లవర్ పెడుతున్నారా మీ మేనిఫెస్టోతో అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు, ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు అంటూ సజ్జల పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఓపెన్‌గా టీడీపీ తమతో ఉందని చెపుతున్నారని.. ఒకేసారి ఎంతమందితో సంసారం చేస్తారని విమర్శలు గుప్పించారు. పురంధేశ్వరి చంద్రబాబు అజెండా మాట్లాడుతుందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌కి ఉన్నది ఏపీ ప్రజలను మరోసారి మోసం చేయగలమనే బరితెగింపు మాత్రమేనన్నారు. సీరియస్ నెస్ లేని వీధి నాటకాలేసుకునే వాళ్ళు కాదు ప్రజలకు కావాల్సిందన్నారు. ప్రభుత్వం, జగన్‌లపై ఆరోపణలు చేస్తే వాటిపై ప్రశ్నలకు సమాధానం చెప్పక్కర్లేదనే బరితెగింపు.. చంద్రబాబు, పవన్‌ల బరితెగింపు ప్రజలు గమనించాలన్నారు. జగన్ ప్రజల నుంచీ తెచ్చుకున్న అజెండా అమలు ఫలితాలే అందరూ గమనిస్తున్నారని సజ్జల చెప్పారు. సామాజిక సాధికారత యాత్ర స్పందనతోనే తెలుస్తుందన్నారు. చంద్రబాబు, పవన్ వారిని వారు ఆత్మ పరీక్ష చేసుకోవాలన్నారు. స్వేచ్ఛ, సాధికారత, సామాజిక న్యాయం ఉన్నాయి కాబట్టే మా యాత్రకు ప్రజలు వస్తున్నారని సజ్జల స్పష్టం చేశారు. 2014-19లో మేనిఫెస్టోతో చంద్రబాబు మాయ చేశాడని.. చంద్రబాబు ఎంత మోసగాడో మేం గుర్తు చేస్తున్నామన్నారు.