Seethakka...ములుగు ప్రజల గుండెచప్పుడు !

0

ధనసరి అనసూయ...ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు, అదే ములుగు సీతక్క అంటే తెలియనివారుండరు అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాజకీయాల్లో సీతక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఈమె తన రాజకీయ అరంగేట్రాన్ని తెలుగుదేశం పార్టీ ద్వారా చేశారు. ములుగు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్క.. రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు. 1988లో నక్సల్‌ పార్టీలో చేరినప్పుడు సీతక్క 10వ తరగతి చదువుతున్న విద్యార్థి. ఫూలన్‌ దేవి రచనల నుంచి ప్రేరణ పొంది, ఆర్థిక దోపిడీ కులవాద వివక్షపై కోపంతో ఉన్న సీతక్క తొలుత విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళం లీడర్‌గా ప్రధాన భూమిక వహించారు. ఆ తర్వాత మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని నందమూరి తారక రామారావు పిలుపునివ్వడంతో.. మావోయిస్టులు అందరూ కూడా పోరుబాట వదిలి లొంగిపోయారు. వివిధ హోదాల్లో పని చేసిన సీతక్క.. కామ్రేడ్‌గా దాదాపు రెండు దశాబ్దాలు గడిపారు. ఈ సమయంలోనే ఆమె దళకమాండర్‌ నక్సల్‌ నాయకుడిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కొడుకు. ఆ సమయంలో తనకు తాను పోలీసులకు లొంగిపోయారు సీతక్క. ఆమె తన అజ్ఞాత జీవితానికి గుడ్‌బై చెప్పి జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. 2001లో హైదరాబాద్లో న్యాయవాదిగా మారడానికి ఎల్‌.ఎల్‌.బి చదివారు. ఈ సమయంలోనే ఆమె ప్రజా విధానం, పాలనపై ఆసక్తి పెంచుకున్నారు. తదనంతరం సామాజిక సేవలో చురుకుగా ఉండి, స్థానికంగా నాయకురాలిగా పేరు సంపాదించారు. 

తెలుగుదేశం పార్టీ టికెట్‌

దీంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున ములుగు నియోజకవర్గం టికెట్‌ ఇచ్చి ప్రోత్సహించారు. 2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో సీతక్క ఓటమి పాలయ్యారు. అయితేనేం 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున అదే స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014 ఎన్నికల్లో వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. ములుగు స్థానం నుంచి సమీప అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. అనంతరం టీడీపీకి గుడ్‌బై చెప్పి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు సీతక్క. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌తో ములుగు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే సీతక్క 2022 డిసెంబర్‌ 10న తెలంగాణ కాంగ్రెస్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా కూడా నియామకం అయ్యారు. ఇక ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ములుగు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.మరోవైపు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి.. ఎస్టీ మహిళకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే.. సీతక్క ముందు వరుసలో ఉన్నారు. అలాగే రాహుల్‌ గాంధీ తన తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని కూడా ములుగు జిల్లా నుంచి మొదలుపెట్టడమే కాదు.. సీతక్క తన చెల్లి అని కూడా అభివర్ణించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో సీతక్కకు ఉన్న అనుబంధం అలాంటిది. అటు గ్రామీణ పార్టీ కార్యకర్తలతో కూడా సీతక్కకు చక్కటి సంబంధాలు ఉన్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !